భగభగలే : గత ఏడాది కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు

  • Publish Date - March 2, 2019 / 02:25 AM IST

ఏడాది సూర్యుడు భగభగలాడిస్తాంట. బయటకొస్తే చురుక్కుమనిపిస్తాడు. ఫిబ్రవరి నెలాఖరు నుండే ఎండలు మండుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈసారి మాత్రం ఎండలు విపరీతంగా ఉంటాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల నుండి తెలంగాణపైకి వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. వడగాలులు అధికంగా వీచడానికి అవకాశాలు ఉండడంతో భానుడు భగభగలు తప్పవని పేర్కొన్నారు. 

రాష్ట్రంలోని కొన్ని చోట్ల 47 నుండి 49 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఆదిలాబాద్, భద్రాచలం వంటి కొన్ని చోట్ల 48-49 డిగ్రీల టెంపరేచర్స్ నమోదయ్యే ఛాన్స్ ఉందని తెలిపారు. సాధారణం కంటే 6 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయితే రెడ్ అలర్ట్ జారీ చేస్తారు అధికారులు. అదే 4-5 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటే ఆరెంజ్ అలర్ట్, కొద్దిగా ఎక్కువగా నమోదైతే వేడి రోజుగా గుర్తించి ఎల్లో అలర్ట్ ఇస్తారు. 

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఫిబ్రవరి నుంచే సమ్మర్ సెగలు మొదలు కావడం జనాల్లో ఆందోళన నింపింది. మండుటెండలు, వేడిగాలులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఫిబ్రవరి 3వ వారంలోనే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరువుతున్న నేపథ్యంలో రాబోయే మండు వేసవిని తలచుకుంటే సొమ్మసిల్లే పరిస్థితి నెలకొంది. ఈసారి సమ్మర్ చాలా హాట్‌గా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రామగుండం, భద్రాచలంతోపాటు మైనింగ్‌ ఏరియాల్లో పగటి ఉష్ణోగ్రతలు 47 నుంచి 48 డిగ్రీల మేర నమోదవుతాయని అంచనా వేస్తున్నారు. హైదరాబాద్‌లోనూ గరిష్టంగా 44 నుంచి 45 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతాయని సమాచారం.

ట్రెండింగ్ వార్తలు