బెట్టింగ్ బెట్టింగ్ బెట్టింగ్.. ఓవైపు IPL హీట్ మరోవైపు ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే దానిపై హైటెన్షన్. దీన్ని క్యాష్ చేసుకుంటున్న బెట్టింగ్ రాయుళ్లు జోరుగా పందాలు కాస్తున్నారు. వీరికితోడు అన్ని పార్టీలకు చెందిన ద్వితీయశ్రేణి నాయకులు కూడా కాయ్ రాజా కాయ్ అంటున్నారు. రాతపూర్వకంగా ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 100 కోట్లకు పైనే. ఇక రిజల్ట్ టైంకి ఈ బెట్టింగ్ వ్యవహారం 4 వందల కోట్లకు పైనే వచ్చే ఛాన్స్ ఉంది.
అభ్యర్ధుల జయాపజయాలు తేలే రోజు మే 23. ఈ రోజు ఎప్పుడు వస్తుందోనని బెట్టింగ్ రాయుళ్లు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. తాము అభ్యర్ధులపై కాసిన పందెం గెలుస్తామా లేదోనని తెగ టెన్షన్ పడుతున్నారు. వందల కోట్లలో బెట్టింగ్‌లు నిర్వహిస్తూ.. అభ్యర్ధుల్లో మరింత టెన్షన్ రేకెత్తిస్తున్నారు. గుడివాడ, మైలవరం నియోజకవర్గాలపై అయితే మరీ ఎక్కువ. రూపాయికి రెండు రూపాయల లెక్కన బెట్టింగ్‌లు కడుతున్నారు. అధికారంలోకి ఏ పార్టీ వస్తుంది ? ఏ అభ్యర్ధి గెలుస్తాడు ? మంత్రుల్లో ఎంతమంది తిరిగి విజయం సాధిస్తారన్నదానిపై జోరుగా బెట్టింగ్ కడుతుండడం విశేషం.
కృష్ణా జిల్లాలో ప్రధానంగా త్రిముఖ పోరు నెలకొంది. 16 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్ధానాల్లో ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయన్న అంశాన్ని మొదలుకుని కీలకమైన అభ్యర్ధులు సాధించే మెజార్టీల వరకూ అన్నింటిపైనా బెట్టింగ్‌లు నడుస్తున్నాయి. టీడీపీ, వైసీపీ, జనసేన సాధించే సీట్ల సంఖ్య ఆధారంగా ఎక్కువ శాతం బెట్టింగ్‌లు నడుస్తున్నాయి. విజయవాడ పశ్చిమ, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ అసెంబ్లీ స్థానాల్లో జనసేన అభ్యర్థులూ బలంగా ఉన్నారు. దీంతో ఆయా స్ధానాల్లో వారు గెలుపొందే అంశాలను బెట్టింగ్ రాయుళ్లు పరిగణలోకి తీసుకుంటున్నారు. పైగా ఈ జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు పోటీ చేస్తున్నారు. వీళ్లలో ఎవరు గెలుస్తారనే దానిపైనా బెట్టింగ్ రాయుళ్లు పందాల్లో దూసుకుపోతున్నారు.
ఆయా బూత్‌లలో పార్టీలకు ఉన్న పట్టును రాజకీయ విశ్లేషకులు పరిగణలోకి తీసుకుని గెలుపోటములు అంచనా వేస్తున్నారు. తర్వాత బెట్టింగ్ కోసం సమాచారాన్ని పంపుతున్నారు. బెట్టింగ్ రాయుళ్లలో ఎక్కువశాతం ఈసారి ప్రధాన పార్టీల ద్వితీయ శ్రేణి నాయకులే ఉండటం గమనార్హం. జిల్లా స్ధాయిలో ఆయా పార్టీల్లో ముఖ్యనేతలుగా ఉన్న వారు కూడా బెట్టింగ్ నిర్వాహకులుగా వ్యవహరిస్తున్నారు.
విజయవాడ నగర పరిధిలోనే టీడీపీ, వైసీపీకి చెందిన వంద మందికిపైగా నేతలు బెట్టింగ్ వ్యవహారానికి కేంద్ర బిందువుగా మారడం గమనార్హం. మామూలుగా కాకుండా రాత పూర్వకంగా పందెం రాయుళ్లు బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ఫలితం తేలిన తర్వాత ఒప్పందం ఆధారంగా చెల్లింపులు ఉంటాయి. ఇక మధ్యవర్తులుగా ఉన్నవారికీ భారీగానే గిట్టుబాటు అవుతోంది. పందెం మొత్తంలో 5 నుంచి 10 శాతం కమీషన్ రూపేణ వస్తోంది. ఇంత జరుగుతున్నా పోలీసులు మాత్రం ఇక్కడ ప్రేక్షక పాత్ర వహిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.