కృష్ణకు పోటెత్తుతున్నవరద

  • Publish Date - October 22, 2019 / 05:12 AM IST

పశ్చిమ కనుమల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా నదిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. కృష్ణా బేసిన్‌లో ఎగువ మహారాష్ట్ర, కర్ణాటకలో కురిసిన వర్షాలతో పదేళ్ల వరద రికార్డులు బధ్దలయ్యాయి. ఓ పక్క ఎగువ కృష్ణా, మరోపక్క తుంగభద్ర, ఇంకోపక్క ఉజ్జయినీ నదులు ఉప్పొంగడంతో బేసిన్‌లోని శ్రీశైలం, సాగర్, జూరాల ప్రాజెక్టులు ఉప్పొంగాయి. గత పది రోజులుగా ప్రవాహాలు తగ్గిపోగా  అక్టోబరు 21 సోమవారం సాయంత్రానికి కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్‌ జలాశయాలకు 1.60 లక్షల క్యూసెక్కుల మేర వరదనీరు వచ్చి చేరింది. ఇప్పటికే ఆ ప్రాజెక్టులు పూర్తిస్ధాయి నీటి సామర్ధ్యానికి చేరుకోవటంతో వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు వదులుతున్నారు. 

నారాయణపూర్‌ నుంచి 1.82 లక్షల క్యూసెక్కులను నదిలో వదులుతుండటంతో తుంగభద్ర జలాశయానికి వరద ఉధృతి పెరుగుతోంది.  76,468 క్యూసెక్కుల వరద వస్తుండగా 86,166 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ఇది అక్టోబరు22 మంగళవారానికి జూరాల, శ్రీశైలానికి చేరే అవకాశం ఉంది. సోమవారం సాయంత్రానికి జూరాలలోకి 44 వేలు, శ్రీశైలంలోకి 57,012, సాగర్‌లోకి 48,236 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరింది. 

శ్రీశైలం ప్రాజెక్టుకు గడిచిన పదేళ్లలో లేనంతగా 1,420 టీఎంసీల మేర వరద వచ్చింది. ప్రాజెక్టు కింద రెండు తెలుగు రాష్ట్రాల నీటి వినియోగం సైతం 130 టీఎంసీలను దాటింది. ఇక జూరాలకు 2010–11లో గరిష్టంగా 787 టీఎంసీల వరద రాగా ఆ మార్కును ఎప్పుడో దాటిపోయింది. ఇక్కడ ఏకంగా 1,190 టీఎంసీల మేర వరద రాగా ప్రస్తుతం వరద స్థిరంగా కొనసాగుతుండటంతో అది మరింత పెరిగే అవకాశం ఉంది.

ఇక నాగార్జునసాగర్‌కు సైతం ఈ ఏడాది 968 టీఎంసీల మేర వరద రాగా, అది ఇంకా కొనసాగే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టుల కింది ఆయకట్టుతో పాటు వీటిపై ఆధారపడి చేపట్టిన కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టుల కింద కనిష్టంగా 15 లక్షల ఎకరాల ఆయకట్టుకు రబీలోనూ నీరందించే అవకాశం ఏర్పడింది. కృష్ణా నది పరీవాహకం, దాని ఉప నదుల పరిధిలో రానున్న 72 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున.. శ్రీశైలానికి భారీ వరద పోటెత్తవచ్చని ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర జల సంఘం రాష్ట్రాలకు సూచించింది.