Hyderabad: లగ్జరీ విల్లాల రాజధానిగా హైదరాబాద్.. రూ.8,562 కోట్ల విక్రయాలతో టాప్ పొజిషన్.. బెంగళూరు, చెన్నై సిటీలు అవుట్

దక్షిణ భారతదేశంలో అల్ట్రా లగ్జరీ గృహాల విక్రయాల్లో హైదరాబాద్ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.

hyderabad city tops south india luxury villas sales report

  • లగ్జరీ ఇళ్లలో హైదరాబాద్ టాప్
  • రూ.8,562 కోట్ల విల్లాల విక్రయం
  • బెంగళూరు చెన్నై కంటే ముందు

Hyderabad: దక్షిణ భారతదేశంలో అల్ట్రా లగ్జరీ గృహాల విక్రయాల్లో హైదరాబాద్ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. రూ. 10 కోట్లు, ఆపై ధర కలిగిన విలాసవంతమైన విల్లాలు, స్కై విల్లాల కొనుగోలులో భాగ్యనగరం బెంగళూరు, చెన్నైలను దాటేసి మొదటి స్థానంలో నిలిచింది. ఇండియా ఎస్ఐఆర్, సీఆర్ఈ మాట్రిక్స్ తాజా నివేదిక ప్రకారం.. ఈ ఏడాది హైదరాబాద్‌లో ఏకంగా రూ. 8,562 కోట్ల విలువైన 625 లగ్జరీ విల్లాలు అమ్ముడయ్యాయి. అదే సమయంలో బెంగళూరులో 125, చెన్నైలో కేవలం 58 ఇళ్లు మాత్రమే విక్రయమవ్వడం హైదరాబాద్ ఆధిపత్యానికి నిదర్శనం.

విస్తీర్ణం & మౌలిక వసతులే ప్లస్ పాయింట్:

ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో(Hyderabad) రూ. 10 కోట్లకు సగటున 6,210 చదరపు అడుగుల భారీ విల్లా లభిస్తోంది. బెంగళూరు కంటే ఇది దాదాపు 58 శాతం ఎక్కువ స్థలం కావడంతో కొనుగోలుదారులు ఇక్కడే విల్లాలు కొనేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఐటీ రంగా విస్తరణ, కోకాపేట్, నియోపోలిస్ వంటి ప్రాంతాల అభివృద్ధి, ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) కనెక్టివిటీ, శంషాబాద్ విమానాశ్రయానికి మెరుగైన రవాణా వసతులు ఎన్నారైలను, బడా వ్యాపారవేత్తలను ఆకర్షిస్తున్నాయి.

గండిపేట, కోకాపేటల్లో హవా:

గడిచిన నాలుగేళ్లలో ఈ లగ్జరీ ఇళ్ల విక్రయాలు 3.5 రెట్లు పెరిగాయి. నగరంలోని కోకాపేట, గండిపేట, మంచిరేవుల, నానక్‌రాంగూడ, కూకట్‌పల్లి ప్రాంతాల్లో అత్యధిక సంఖ్యలో రూ. 10 కోట్ల పైబడిన ఇళ్లు అమ్ముడయ్యాయి. ఒక్క కోకాపేట్ ప్రాంతంలోనే రూ. 1,298 కోట్లతో 111 యూనిట్ల విక్రయాలు జరగడం విశేషం. చెన్నై, బెంగళూరు నగరాలతో పోలిస్తే ఇక్కడ ట్రాఫిక్ సమస్యలు తక్కువగా ఉండటం, అనుకూల వాతావరణం ఉండటం కూడా రియల్ ఎస్టేట్ పురోగతికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి.