HMWSSB: హైదరాబాద్‌లో నీటి వృథాపై కఠిన చర్యలు.. జలమండలి ఎండీ సంచలన నిర్ణయం.. రూ.5 వేల జరిమానా!
హైదరాబాద్‌లో(HMWSSB) ట్యాంకర్ల ద్వారా నీటిని వృథా చేస్తే నవంబర్ 1 నుంచి రూ.5 వేల జరిమానాతో పాటు రిజిస్ట్రేషన్ రద్దు చేస్తామని జలమండలి హెచ్చరించింది.
Hyderabad hmwssb water tanker leakage fine 5000 rupees rules from november 1
HMWSSB: హైదరాబాద్ మహానగరంలో ట్యాంకర్ల ద్వారా జరిగే నీటి దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ (HMWSSB) కీలక నిర్ణయం తీసుకుంది. నగరవ్యాప్తంగా సరఫరా చేసే వాటర్ ట్యాంకర్ల నుంచి నీరు రోడ్లపై వృథాగా పారడంపై జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ (MD) కె. అశోక్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నీటి వృథాను వెంటనే నివారించేందుకు ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసిన ఆయన, రాబోయే నవంబర్ 1వ తేదీ నుంచి నిబంధనలు ఉల్లంఘించే ట్యాంకర్ యజమానులపై భారీగా జరిమానాలు విధించనున్నట్లు స్పష్టం చేశారు.
లీకేజీలు, మూతలు లేని ట్యాంకర్లపై నిషేధం.. రెండోసారి ఉల్లంఘిస్తే రిజిస్ట్రేషన్ రద్దు:
రవాణా సమయంలో ట్యాంకర్లకు సరైన మూతలు లేకపోవడం, బాడీ లీకేజీల కారణంగా భారీగా నీరు వృథా అవుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఇకపై ఫిల్లింగ్ స్టేషన్ల వద్ద మూతలు సరిగా లేని, నీరు కారుతున్న ట్యాంకర్లను నింపకూడదని ఎండి అధికారులను ఆదేశించారు. నవంబర్ 1 నుంచి మొదటిసారి నీటిని వృథా చేస్తే సదరు ట్యాంకర్ యజమానికి రూ.5,000 ఫైన్ విధిస్తారని, అదే ట్యాంకర్ రెండోసారి కూడా నియమాలు ఉల్లంఘిస్తే దాని రిజిస్ట్రేషన్‌ను శాశ్వతంగా రద్దు చేస్తామని హెచ్చరించారు. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (O&M) విభాగాల జనరల్ మేనేజర్లు ఈ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.
ఫిల్లింగ్ స్టేషన్ల వద్ద కఠిన తనిఖీలు.. బాధ్యతగా వ్యవహరించాలని ఎండీ సూచన:
ట్యాంకర్లలో నీటిని నింపే ముందే లీకేజీలు, క్యాప్‌ల కండిషన్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, ఏవైనా లోపాలు ఉంటే వాటిని పూర్తిగా బాగు చేసే వరకు వాటర్ ఫిల్లింగ్ చేయడానికి అనుమతించబోమని జలమండలి తెగేసి చెప్పింది. నగర ప్రజల దాహార్తిని తీర్చే విలువైన తాగునీటిని బొట్టు కూడా వృథా కాకుండా చూడాల్సిన బాధ్యత ట్యాంకర్ల యజమానులు, డ్రైవర్లదేనని అశోక్ రెడ్డి సూచించారు. ప్రయాణ సమయంలో రవాణా నిబంధనలు పక్కాగా అమలు చేసేలా క్షేత్రస్థాయి అధికారులు నిరంతర ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని స్పష్టం చేశారు.
