తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. పలు జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయి. ఎండలకు తాళలేక ప్రజలు పలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. బయటకు రావడానికే జంకుతున్నారు. మధ్యాహ్న సమయంలో రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఎండల నుండి ఉపశమనం పొందేందుకు శీతలపానీయాల వైపు పరుగులు తీస్తున్నారు. దీనితో వాటికి యమ గిరాకీ పెరిగిపోయింది.
ఇక ఇదిలా ఉంటే మార్చి 27వ తేదీ బుధవారం కామారెడ్డి జిల్లా బిక్నూరు మండలంలో గరిష్టంగా 41 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల నమోదైంది. సిరిసిల్లా జిల్లా గంభీరావు పేట, నిజామాబాద్ జిల్లా బెల్లల్‌లో 40.9 డిగ్రీల టెంపరేచర్స్ నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లా ఆందోలు, మెదక్ జిల్లా అల్లాదుర్గ్, హవేలి ఘన్ పూర్‌లో 40.8 డిగ్రీలు ఉష్ణోగ్రతల నమోదైనట్టు వాతావరణ శాఖ పేర్కొంది. రాష్ట్రంలో మార్చి 28, మార్చి 29 తేదీల్లో ఇదే స్థాయి ఎండలు ఉంటాయని స్ఫష్టం చేసింది.