Hyderabad Missing Case: హైదరాబాద్ మిస్సింగ్ మిస్టరీ వీడింది.. తల్లిదండ్రుల గొడవల వల్లే.. ఛత్తీస్‌గఢ్ పారిపోయిన ముగ్గురు బాలికలు
హైదరాబాద్‌లోని(Hyderabad Missing Case) దోమలగూడ ఫరీద్ బస్తీలో మిస్సైన ముగ్గురు బాలికల కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు.
- V Santhosh Kumar
- Published on- July 27, 2026 / 09:14 AM IST
Hyderabad Domalguda missing girls found chhattisgarh parents dispute police
- తల్లిదండ్రుల గొడవలతో బాలికల పారిపోక
- సీసీ కెమెరాల ద్వారా ఆచూకీ
- బాలికలను కాపాడిన దోమలగూడ పోలీసులు
Hyderabad Missing Case: హైదరాబాద్‌లోని దోమలగూడ ఫరీద్ బస్తీలో నివసిస్తున్న ఛత్తీస్‌గఢ్ వలస కార్మికులు తోటరాం, రాంధులారి దంపతుల మధ్య నిత్యం జరుగుతున్న గొడవలు ఆ ఇంట్లోని పిల్లలకు నరకాన్ని చూపించాయి. తల్లిదండ్రుల నిరంతర కలహాలతో విసిగి వేసారిపోయిన వారి కుమార్తెలు సహిత కుమారి (17), స్నేహ కుమారి (16)లతో పాటు సమీప బంధువైన లత (15) సొంతూరికి వెళ్లి ఏదైనా పని చేసుకుని బతుకుదామని నిర్ణయించుకున్నారు. గత ఆదివారం తెల్లవారుజామున ఎవరికీ చెప్పకుండా ఇంట్లోంచి బయటకు వచ్చిన బాలికలు, హిమాయత్‌నగర్ నుంచి ఆటోలో కాచిగూడకు, అక్కడి నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. ఘన్‌పూర్ ఎక్స్‌ప్రెస్ ఎక్కి నాగ్‌పూర్ మీదుగా ఛత్తీస్‌గఢ్‌కు పారిపోగా, ఆందోళన చెందిన తల్లిదండ్రులు దోమలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Gas E-Kyc: గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. ఈ-కేవైసీ చేయకపోతే కనెక్షన్ కట్.. ఇదే లాస్ట్ ఛాన్స్
సీసీ కెమెరాల జల్లెడ & ఛత్తీస్‌గఢ్‌లో ఆచూకీ:
ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగి 5 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. ప్రయాణ మార్గాల్లో దాదాపు 262 సీసీటీవీ కెమెరాల ఫుటేజీని సమగ్రంగా పరిశీలించి బాలికల కదలికలను గుర్తించారు. నాగ్‌పూర్ చేరుకున్న బాలికలను ఒక వ్యక్తి చేరదీసి ఛత్తీస్‌గఢ్‌లోని పతంజూరుకు చెందిన బిశ్వజిత్ అనే ఫామ్‌హౌస్ యజమాని దగ్గరకు తీసుకెళ్లాడు. అయితే ఆ బాలికలు ఇంట్లోంచి పారిపోయి వచ్చారని గ్రహించిన బిశ్వజిత్, వెంటనే దోమలగూడ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో కాంకర్ పోలీసుల సహకారంతో హైదరాబాదీ పోలీసులు అక్కడికి చేరుకుని బాలికల(Hyderabad Missing Case)ను సురక్షితంగా తీసుకొచ్చారు.
అధికారుల ప్రకటన & సఖీ సెంటర్‌కు అప్పగింత:
ఈ కేసు వివరాలను ఆదివారం గాంధీ నగర్ ఏసీపీ కార్యాలయంలో సికింద్రాబాద్ డీసీపీ రక్షిత కృష్ణమూర్తి, అడిషనల్ డీసీపీ నరసయ్య, ఏసీపీ యాదగిరి, సీఐ అంజద్ అలీలతో కలిసి వెల్లడించారు. సురక్షితంగా తీసుకొచ్చిన బాలికలను కౌన్సెలింగ్ నిమిత్తం సఖీ సెంటర్‌కు అప్పగించినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా డీసీపీ రక్షిత కృష్ణమూర్తి మాట్లాడుతూ.. ఇంట్లో నిత్యం ఉండే గొడవలు పిల్లల మనసులపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయని, తల్లిదండ్రులు బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తూ స్నేహపూర్వక వాతావరణంలో పిల్లలను పెంచాలని హితవు పలికారు.
