ఆర్టీసీ సమ్మె ఉధృతం : ఇందిరాపార్కు వద్ద ధర్నా..ఫర్మిషన్ ఇవ్వని పోలీసులు

  • Publish Date - October 7, 2019 / 12:36 AM IST

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ఇప్పటిదాకా ఒక ఎత్తు. ఇవాళ్టి నుంచి జరగబోయేది మరో ఎత్తుగా ఉండనుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో.. కార్మికులు సమ్మెను మరింత ఉద్ధృతం చేయాలని నిర్ణయించుకున్నారు. సమ్మెను మరింత ఉద్ధృతం చేసేందుకు 2019, అక్టోబర్ 07వ తేదీ సోమవారం ఇందిరాపార్క్ దగ్గర ధర్నా చేయాలని డిసైడ్ అయ్యారు ఆర్టీసీ జేఏసీ నేతలు. కానీ.. అక్కడ ఆంక్షలు ఉండటంతో.. పోలీసులు పర్మిషన్ ఇవ్వబోమని చెబుతున్నారు. దీంతో.. కార్మికుల రియాక్షన్ ఎలా ఉండబోతుందన్నది ఆసక్తిగా మారింది.

మరోవైపు రాష్ట్రంలోని బస్ డిపోల దగ్గర పరిస్థితులు ఎలా మారతాయన్నది ఆందోళనకరంగా ఉంది. ఇప్పటివరకు.. శాంతియుతంగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు.. ప్రభుత్వ నిర్ణయంతో.. ఏం చేస్తారోనన్నది కాస్త భయాందోళన రేకెత్తిస్తోంది. ప్రభుత్వం డెడ్‌లైన్ విధించినప్పటికీ కార్మికులు విధులకు హాజరుకాలేదు. అయితే యాజమాన్యం మాత్రం ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది.

ప్రైవేటు డ్రైవర్లు, కండక్టర్లతో చాలా వరకు బస్సులు రోడ్డెక్కాయి. డిపోల ముందు కార్మిక సంఘాలు ఆందోళనలు చేస్తుండగా.. పోలీసు భద్రత మధ్య 35 శాతం బస్సులు నడిచాయి. ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేటు వాహనాలను, స్కూల్‌ బస్సులను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రభుత్వం విధించిన డెడ్‌లైన్‌తో కొంతమంది సిబ్బంది విధులకు హాజరవ్వగా… చాలామంది సమ్మెను కొనసాగిస్తున్నారు. దీంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. 

ఆర్టీసీ సమ్మె రెండో రోజూ విజయవంతమైందన్నారు జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి. అక్టోబర్ 07వ తేదీ సోమవారం నుంచి ఇందిరాపార్క్ దగ్గర నిరాహార దీక్షలు చేపడతామని ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా కార్మిక కుటుంబాలతో కలిసి అన్ని డిపోల ముందు నిరసనలు తెలియజేశామన్నారు. తమ సమ్మెకు అన్ని పార్టీల నుంచి మద్దతు లభిస్తోందన్నారు అశ్వత్థామ రెడ్డి. మరి ఆర్టీసీ జేఏసీ నేతలు చేపట్టనున్న ధర్నా ఎలాంటి మలుపులు తీసుకుంటుందో చూడాలి. 
Read More : స్ట్రైక్‌కు సర్కార్ స్ట్రోక్ : ఆర్టీసీలో కొత్త నియామకాలు