నగర పోలీసులు ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారు. కొత్త టెక్నాలజీని వినియోగిస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా చూస్తున్నారు. హింసకు, దారుణాలకు తెగబడుతున్న వారిపై ఉక్కుపాదం మోపేందుకు నగర పోలీసులు సరికొత్త పర్యవేక్షణ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు. TS COP అప్లికేషన్‌లో చేర్చిన ‘రౌడీ షీటర్ మాడ్యూల్’ మే 09వ తేదీ గురువారం నుండి అందుబాటులోకి తెచ్చారు. బషీర్ బాగ్‌లోని నగర పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ ప్రారంభించారు.
ప్రతి పీఎస్‌లో రౌడీ షీటర్లుగా నమోదైన వారి ప్రతి డేటా ప్రతి పోలీసు అధికారికి అందుబాటులో ఉంటుందని అంజనీ కుమార్ వెల్లడించారు. ఫీల్డ్ ఆఫీసర్లు తమ యూజర్ నేమ్‌తో లాగిన్ అయి..రౌడీ షీటర్ల డాటాను తనిఖీ చేయవచ్చని, వారి ఫొటోలు కూడా అందుబాటులో ఉంటాయన్నారు. ఈ రౌడీ షీటర్స్ మాడ్యూల్ వల్ల పెట్రోల్ కార్లు, బ్లూ కోల్డ్స్ వారు ఉంటున్న చిరునామాలకు వెళ్లడంతో పాటు వారి కదలికలపై నిఘా ఉంచి వారి జియో టాగ్ లోకేషన్ మ్యాప్‌లో పొందుపరచవచ్చన్నారు. నగర పోలీసు కమిషనరేట్ వ్యాప్తంగా ఈ గవర్నర్నెన్స్ అమలు చేస్తుండడంతో ఆయా పోలీస్ స్టేషన్లకు కంప్యూటర్లు, ప్రింటర్లను సీపీ అందచేశారు.