Hyd Police
Hyderabad Police: ప్రజలు చాలా మారిపోతున్నారు.. ముఖ్యంగా హైదరాబాద్ నగర వాసులు ఎప్పటికప్పుడు ట్రెండ్ ఫాలో అయ్యేందుకు ప్రయత్నిస్తుంటారు. మరి పోలీసులు పాత చింతకాయ పచ్చడిలా మూస పద్ధతిలో చెప్తే నగర వాసులు వింటారా? అందుకే హైదరాబాద్ పోలీసులు సైతం సరికొత్తగా చెప్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో మీమ్స్, పంచ్ డైలాగుల ప్రభావం ఎంతగా పనిచేస్తుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. కనుక పోలీసులు సైతం మీమ్స్, డైలాగులతోనే సోషల్ మీడియాలో వినూత్న క్యాంపైన్ చేస్తున్నారు. తాము ప్రజలకు చెప్పాలనుకున్న దాన్ని తనదైన శైలిలో వెటకారం జోడించి ప్రజలలోకి వెళ్లేలా ప్లాన్ చేసుకుంటున్నారు.
hyderabad police
హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్, సైబర్ క్రైం పోలీసులకు పెను సవాల్. ఎప్పటికప్పుడు వీటి నియంత్రణకు పోలీసులు అహర్నిశలు కష్టపడుతుంటారు. ట్రాఫిక్ నిబంధనలను ప్రజలలోకి తీసుకెళ్తూ భారీ జరిమానాలు విధిస్తుంటారు. కానీ, నిబంధనలను అనుసరించి క్రమశిక్షణ నేర్చుకోవాల్సిన సిటిజన్స్ కొందరు అడ్డదారులలో ఆ జరిమానాలు తప్పించుకొనేందుకు ప్రయత్నిస్తుంటారు. వారికి పోలీసులు అదే రేంజిలో ఝలక్ ఇస్తున్నారు. అలా ఫైన్స్ తప్పించుకునేందుకు ప్రయాణిస్తూ దొరికిపోయిన వారి ఫోటోలకు పంచ్ డైలాగులను కలిపి సోషల్ మీడియాలో క్యాంపైన్ చేస్తున్నారు. అవి సోషల్ మీడియాలో ట్రెండీగా నిలుస్తున్నాయి. ఉదాహరణకు బైక్ నెంబర్ ప్లేట్ కు మాస్క్ తగిలించి నెంబర్ కనిపించకుండా చేసిన రైడర్ ఫోటోకు నరసింహ సినిమాలో రజినీకాంత్ చెప్పే డైలాగ్‌ను మార్చి.. ‘అతిగా ఉల్లంఘనలు చేసే వాహనదారులు, చలాన్లు పడకుండా నంబర్ ప్లేట్ దాచేవాళ్లు తప్పించుకున్నట్టు చరిత్రలో లేద’ని జతచేశారు.
hyderabad police
ట్రాఫిక్ ఉల్లంఘనలకు తోడు నగరంలో సైబర్ క్రైమ్ మీద స్పెషల్ దృష్టి పెట్టిన పోలీసులు ఎప్పటికప్పుడు వివిధ పద్దతులలో ప్రజలను ఎడ్యుకేట్ చేస్తున్నారు. కానీ నేరాలు మాత్రం ఆగడం లేదు. ప్రజల బలహీనతలను క్యాచ్ చేసిన మోసగాళ్లు బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. అందుకే పోలీసులు వారి వారి బలహీనతలను ఎత్తి చూపుతూ సెటైర్లతో కూడిన డిజైన్లను చేయించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇవి ప్రజలను ఆకర్షించడంతో పాటు అవగాహనను పెంచుతున్నాయి. ఉదాహరణకు సైబర్ నేరగాళ్లకు సంబంధించిన వార్తకు ఎన్టీఆర్ బాద్ షా సినిమాలోని బ్రహ్మానందం, నాజర్ల మధ్య ఫేమస్ డైలాగ్‌ను మార్చి ‘పద్మనాభ సింహా.. నీకు ఎన్నిసార్లు చెప్పాలి. ఇలాంటి ఫ్రాడ్ మెసేజ్‌లు వచ్చినప్పుడు రెస్పాండ్ కావొద్దని, ఇప్పుడు చూడు డబ్బు మొత్తం పోగొట్టుకున్నావ్’ అని పెట్టారు.
hyderabad police
జస్ట్ పైన చెప్పుకున్నవి ఉదాహరణలు మాత్రమే. ఇలాంటి ట్రాఫిక్ ఉల్లంఘనలు, సైబర్ నేరాలపై నిరంతరం ఇలాంటి పోస్ట్స్ తో హైదరాబాద్ పోలీసులు సోషల్ మీడియాలో వినూత్నంగా క్యాంపైన్ నిర్వహిస్తున్నారు. వీటికి నెటిజన్ల నుండి విశేష స్పందన రావడంతో పోలీసులు కూడా మరికాస్త ఎక్కువగా పనిచేసేందుకు కృషి చేస్తున్నారు. సినిమా డైలాగులు ప్రజలలో ఎక్కువ కాలం గుర్తుండిపోతుంటాయి. అందుకే వాటిని వాడుకొనే మేము చెప్పాలనుకున్నది చెప్తే ఇవి కూడా ఎక్కువ కాలం గుర్తుండిపోతాయని, మరింత ఆకర్షణీయంగా చెప్తే ఫలితాలు ఆశించిన స్థాయిలో అందుతాయని ఈ తరహా ప్రచారం చేస్తున్నామని సైబరాబాద్ సీపీ సజ్జనార్ వెల్లడించారు.
hyderabad police