పాటించాలి జాగ్రత్తలు : మండనున్న ఎండలు

  • Publish Date - February 16, 2019 / 02:52 AM IST

తెలంగాణ రాష్ట్రంలో ఈ సంవత్సరం సూర్యుడు చుక్కలు చూపెట్టనున్నాడు. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని వాతావరణ శాఖ భావిస్తోంది. ఎందుకంటే ఫిబ్రవరి రెండో వారం నుండే సూర్యుడు మెల్లిమెల్లిగా భగభగలాడిస్తున్నాడు. ఉష్ణోగ్రతలు ఏకంగా 35 డిగ్రీలకు చేరడంతో ఈ సంవత్సరం ఎండలు మండనున్నాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. మరో వారం రోజుల్లో ఎండలు పెరిగే ఛాన్స్‌లున్నాయని పేర్కొంటున్నారు. 

2009 ఫిబ్రవరిలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత 39.1 డిగ్రీలుగా ఉంది. ఇక గతేడాది (2018) ఫిబ్రవరి నెలలో అత్యధికంగా 35.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈసారి ఈ రికార్డులను బ్రేక్ చేసే అవకాశాలున్నాయి. ఫిబ్రవరి 15వ తేదీ శుక్రవారం నగరంలో 34.4 డిగ్రీల గరిష్ట, 19.9 డిగ్రీల కనిష్ట టెంపరేచర్స్ నమోదయ్యాయి. సాధారణం కంటే ఇప్పుడే 1-2 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యాయి. 

ఎండలు మండనున్న దృష్ట్యాప్రజలు ఇప్పటి నుండే ప్రజలు అప్రమత్తమవుతున్నారు. పేదల ఫ్రిజ్ కుండలను ఇప్పుడే తీసుకెళుతున్నారు. వేసవి నుండి ఉపశమనం పొందేందుకు జ్యూస్, ఇతర రసాలపై ఆధారపడుతున్నారు. ఇంట్లో చల్లగా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. పలు షాపుల్లో ఫిబ్రవరి సెకండ్ వీక్ నుండే కూలర్లు, ఏసీలు సేల్ అవుతున్నాయి. మార్చి, మే నెల వచ్చే సరికి ధరలు అధికమౌతాయని జనాలు అంచనా వేసి ముందే కొనుగోలు చేస్తే బెటర్ అని ఆలోచిస్తున్నారు…మండనున్న ఎండల నుండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.