Hyderabad Water Supply: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. నవంబర్ 3, 4 తేదీల్లో తాగునీటి సప్లై బంద్.. ఏ ఏ ఏరియాల్లోనో తెలుసా?
గండిపేట కాండ్యూట్‌లో లీకేజీల అత్యవసర మరమ్మతుల కారణంగా హైదరాబాద్‌లోని(Hyderabad Water Supply) పలు కీలక ప్రాంతాల్లో తాగునీటి సరఫరా నిలిచిపోనుంది.
- V Santhosh Kumar
- Published on- October 31, 2026 / 10:44 PM IST
Hyderabad water supply disruption for 36 hours on nov 3 and 4 hmwssb alert
Hyderabad Water Supply: హైదరాబాద్ మహానగరంలోని పలు కీలక ప్రాంతాల ప్రజలకు హైదరాబాద్ నీటి సరఫరా, మురుగునీటి పారుదల మండలి అత్యవసర హెచ్చరిక జారీ చేసింది. నగరానికి మంచినీరు అందించే గండిపేట కాండ్యూట్‌లో ఏర్పడిన భారీ లీకేజీలను అరికట్టేందుకు అత్యవసర మరమ్మతు పనులు చేపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ పనుల కారణంగా నవంబర్ 3వ తేదీ ఉదయం 6 గంటల నుంచి నవంబర్ 4వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 36 గంటల పాటు అనేక ప్రాంతాల్లో తాగునీటి(Hyderabad Water Supply) సరఫరా పూర్తిగా నిలిచిపోనుంది.
సబ్జా కాలనీ, టోలిచౌకి, మణికొండ పరిధిలో లీకేజీల మరమ్మతులు.. ప్రభావిత ప్రాంతాలు ఇవే:
గండిపేట కాండ్యూట్ పరిధిలోని సబ్జా కాలనీ, టోలిచౌకి, మణికొండ ప్రాంతాల్లో ప్రధాన పైప్‌లైన్ లీకేజీలను సరిచేసేందుకు జలమండలి ఇంజినీరింగ్ బృందాలు చర్యలు చేపట్టనున్నాయి. ఈ మరమ్మతుల వల్ల గోషామహల్, కార్వాన్ సర్కిళ్ల పరిధిలో తాగునీటి సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడనుంది. వీటితో పాటు రెడ్‌హిల్స్, నాంపల్లి, మల్లేపల్లి, సీతారాంబాగ్, అసెంబ్లీ, సెక్రటేరియట్, ఆదర్శ్‌నగర్, గన్ ఫౌండ్రీ, గోల్కొండ జోన్ పరిధిలోని చింతల్ బస్తీ, విజయనగర్ కాలనీల్లో నీటి సరఫరా బంద్ కానుంది.
ఓల్డ్ మల్లేపల్లి నుంచి బంజారాహిల్స్ వరకు నీటి కష్టాలు.. పొదుపుగా వాడాలని అధికారుల విజ్ఞప్తి:
అలాగే ఓల్డ్ మల్లేపల్లి, ఆసిఫ్‌నగర్, అహ్మద్‌నగర్, కవాడిగూడ, గాంధీనగర్ వార్డుల పరిధిలోని దోమలగూడ, బంజారాహిల్స్ వార్డు ప్రాంతాల్లోనూ మంచినీటి కొరత ఏర్పడనుంది. సుదీర్ఘంగా 36 గంటల పాటు నీటి సరఫరా పునరుద్ధరణ కాకపోవడంతో వినియోగదారులు ఇబ్బందులు పడకుండా ముందుగానే తగినంత నీటిని నిల్వ ఉంచుకోవాలని అధికారులు కోరారు. ప్రభావిత ప్రాంతాల ప్రజలందరూ అందుబాటులో ఉన్న నీటిని అత్యంత పొదుపుగా వినియోగించుకోవాలని జలమండలి సూచించింది.
