ఇప్పటివరకు ఐటీ,ఫార్మా రంగాలకు చిరునామాగా ఉన్న హైదరాబాద్ ఇకపై లేజర్ టెక్నాలజీ హబ్‌గా కూడా మారుతుందని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (TIFR) డైరక్టర్ ప్రొఫెసర్ సందీప్ త్రివేదీ అన్నారు. బ్రిటన్‌కు చెందిన 2 వేర్వేరు బృందా లు గురువారం టీఐఎఫ్‌ఆర్‌ను సందర్శించాయి. లేజర్ టెక్నాలజీపై పరిశోధనలకు వీలుగా హైదరాబాద్ టీఐఎఫ్‌ఆర్ ఆవరణలో కొత్తగా ఏర్పాటు చేసే ఫోటానిక్ ఇన్నొవేషన్ సెంటర్ (ఎపిక్)కు కేంద్రం రూ.896 కోట్లు కేటాయించిందని తెలిపారు. బ్రిటన్ భాగస్వామ్యంతో జరిగే ఈ పరిశోధనల కోసం యూకే రీసెర్చ్ అండ్ ఇన్నొవేషన్ (యుక్రి)మరో రూ.25 కోట్లు ఖర్చుచేయనున్నట్లు తెలిపారు.
లేజర్ పరిశోధనకు అనువైన మానవ వనరులు హైదరాబాద్‌లో అందుబాటులో ఉండటంతో యుక్రి అనుబంధ సంస్థ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫెసిలిటీస్ కౌన్సిల్ (ఎస్‌టీఎఫ్‌సీ) ఆసక్తి చూపుతోందన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ టీఎఫ్‌ఐఆర్‌లో 150 టెరావాట్ల సామర్థ్యమున్న లేజర్ కిరణాలను సృష్టించి, పరిశోధనలు చేస్తున్నట్లు త్రివేదీ తెలిపారు. భవిష్యత్తులో ఎపిక్‌లో జరిగే పరిశోధనల ద్వారా ఒక పెటా వాట్ (సుమారు వేయి టెరావాట్లు) సామర్ద్యమున్న లేజర్ కిరణాలను సృష్టిస్తామన్నారు.
అత్యంత సామర్థ్యమున్న లేజర్ కిరణాల ద్వారా అంతరిక్ష పరిశోధనలతో పాటు కేన్సర్, ఇతర వ్యాధి నిర్ధారణ పరీక్షలు మరింత మెరుగ్గా చేసేందుకు వీలుంటుందని సందీప్ త్రివేదీ తెలిపారు. ఎపిక్‌లో సృష్టించే అధిక సామర్థ్యం ఉన్న లేజర్ కిరణాలను ‘కృత్రిమ నక్షత్రాలు’గా అభివర్ణిస్తూ, ఈ కిరణాల నుంచి వెలువడే ఎలక్ట్రాన్లు, రేడియేషన్, ప్లాస్మా కిరణాలు వివిధ రంగాల్లో పరిశోధనలకు కల్పిస్తాయన్నారు. సీసీఎంబీ, ఐఐసీటీ, ఐఐటీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలకు కేంద్రంగా ఉన్న హైదరాబాద్‌లో ఎపిక్ ఏర్పాటు ద్వారా లేజర్ టెక్నాలజీ హబ్‌గా మారుతుందని ఆయన అన్నారు.