హైదరాబాద్ నగరంలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుండే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీంతో జనాలు బయటకు రావడానికే జంకుతున్నారు. రాత్రి వేళల్లో ఉక్కపోతతో పలు ఇబ్బందులు పడుతున్నారు. ఇంట్లోంచి బయటకు రాలేనంతగా వేడి సెగ కొడుతోంది. బయటకు వెళితే..వడగాల్పుల బారిన పడుతున్నారు. నైరుతి రుతుపవనాలు కాస్త ఆలస్యంగా ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ పేర్కొనడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
మే 15వ తేదీ బుధవారం గరిష్ట ఉష్ణోగ్రత 43.2 డిగ్రీలు నమోదైంది. కనిష్ట ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలకు తగ్గడం లేదు. సాయంత్రం 4 గంటల తర్వాత నగరంలో ఈదురుగాలులతో ఎండ వేడి తగ్గింది. అయినా గాలుల భయం మాత్రం ఉంది. నగరంలోని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ స్తంభించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. శుభ్రంగా ఉన్న పానీయాలు మాత్రమే తాగాలని, ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండలో తిరగకపోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.