INTER అంతులేని నిర్లక్ష్యం : గ్లోబరీనా సంస్థే కారణం

  • Publish Date - April 28, 2019 / 01:23 AM IST

లక్షలాది మంది ఇంటర్‌ విద్యార్థుల కన్నీటికి, కష్టాలకు గ్లోబరీనా సంస్థ కారణమని తేలింది. Inter ఫలితాల్లో గందరగోళానికి గ్లోబరీనా నిర్వాకమే కారణమని త్రిసభ్య కమిటీ తేల్చింది. ఇంటర్‌ ఫలితాల వెల్లడి గ్లోబరీనా తరం కాదని, ఫెయిల్‌ అవ్వడం ఖాయమని  ముందే తెలిసినా… ఇంటర్‌ బోర్డు కూడా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడింది. లక్షలాది మంది బాల బాలికల భవితవ్యాన్ని గాలికొదిలేసింది. ఫలితాల్లో తప్పులకు కారణమైన బోర్డు అధికారులు, గ్లోబరీనా సంస్థపైనా చర్యలు తీసుకోనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. 

ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో నెలకొన్న వివాదాలపై తెలంగాణ సర్కార్‌ ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ ఏప్రిల్ 27వ తేదీ శనివారం నివేదకను సమర్పించింది. ఈ కమిటీ దాదాపు 5 రోజుల పాటు సుదీర్ఘ పరిశీలన చేపట్టి… 10 పేజీల నివేదికను రూపొందించింది.  పరిశీలన ప్రక్రియ అంతా నాలుగు ప్రధాన అంశాలుగా విభజించింది.  కాంట్రాక్టు సంస్థకు అప్పగించిన విధులు, ఉపయోగించిన మానవ వనరులు, తప్పిదాలు జరిగిన ప్రక్రియ, తీసుకున్న చర్యలు ఇలా సాంకేతిక అంశాల ఆధారంగా పరిశీలన చేపట్టింది. వీటిని లోతుగా సమీక్షించిన కమిటీ పలు అంశాలను గుర్తిస్తూ నివేదికను రూపొందించింది. దీంతోపాటుగా పొరపాట్ల సవరణ, భవిష్యత్‌లో చేపట్టాల్సిన అంశాలపైనా లోతైన విశ్లేషణ చేసి  సూచనలు కూడా చేసింది. 

ఇంటర్మీడియట్ పరీక్ష వాల్యుయేషన్‌, ఫలితాల విడుదలలో లోపాలున్నట్టు త్రిసభ్య గుర్తించిందని.. ఇకపై జాగ్రత్తలు తీసుకోవాలని కూడా త్రిసభ్య కమిటీ సూచించిందని విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి తెలిపారు. కొన్ని పొరపాట్లు జరిగింది వాస్తవేమనని, మానవ తప్పిదాల కన్నా సాంకేతిక లోపాలే ఎక్కువగా ఉన్నట్టు కమిటీ తెలిపిందన్నారు. సాఫ్ట్‌వేర్‌ లోపాల వల్ల కోడింగ్‌, డీకోడింగ్‌ సమస్యలు వచ్చాయని తెలిపారు. స్వతంత్రంగా వ్యవహరించే మరో సమాంతర ఏజెన్సీని ఎంపిక చేసుకోవాలని, దానికి రీ వెరిఫికేషన్‌, రీకౌంటింగ్‌ బాధ్యతలు ఇవ్వాలని త్రిసభ్య కమిటీ సూచించిందన్నారు. OMR షీట్‌లో బబ్లింగ్‌ లోపాల వల్ల అతి తక్కువ ఫలితాలు మారాయని, ఫలితాల్లో గందరగోళానికి కారకులైన అధికారులపై చర్యలు ఉంటాయన్నారు. గ్లోబరీనా సంస్థకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని… ఫలితాల్లో తలెత్తిన సమస్యల కారణంగా ఆ సంస్థపైనా చర్యలు తీసుకుంటామన్నారు. 

* త్రిసభ్య కమిటీ నివేదికలోని అంశాలను విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి  వివరించారు.
– ఇంటర్మీడియట్‌ బోర్డు నిర్దేశించిన బాధ్యతల్లో కీలక ఘట్టాలను సైతం కాంట్రాక్టు సంస్థ నిర్లక్ష్యం చేసినట్టు త్రిసభ్య కమిటీ తన నివేదికలో చేర్చింది. హాల్‌ టికెట్ల జారీ, ఫలితాల విడుదల తదితర కార్యక్రమాలను నిర్దేశించిన తేదీల కంటే ముందుగా మాక్‌ టెస్ట్‌ నిర్వహించాలి.
–  అంతా సవ్యంగా ఉందనుకుంటేనే ఫలితాలు వెల్లడి చేయాలి. కానీ ఇందుకు తగిన ప్రామాణిక నిర్వహణ వ్యవస్థను కాంట్రాక్టు సంస్థ ఎక్కడా వినియోగించలేదు.
–  గతేడాది జరిగిన తప్పిదాలను ఇంటర్‌ బోర్డు గ్లోబరీనా సంస్థకు వివరించినా అది విస్మరించింది.
–  ఇంటర్‌ బోర్డు నిర్దేశించిన బాధ్యతలను నిర్వహించడంలో గ్లోబరీనా పూర్తిగా విఫలమైంది.
–  డేటా మైగ్రేషన్‌, మొబైల్‌ యాప్‌కు అనుసంధానమయ్యేలా విద్యార్థుల ఆన్‌లైన్‌ సర్వీసు, అడ్మిషన్‌ మాడ్యూల్‌, పరీక్షా కేంద్రాల నిర్వహణ, ప్రీ ఎగ్జామినేషన్‌, పోస్ట్‌ ఎగ్జామినేషన్‌ వర్క్‌ చేయాలి. కానీ ఇవేమీ చేయలేదు.
–  నిర్దేశిత గడువు దాటి పూర్తిచేసినా అందులోనూ లోపాలున్నాయి.
–  దీంతో కలిగిన అసౌకర్యమే విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళనకు కారణమైంది. ఇందుకు కాంట్రాక్టు సంస్థతోపాటు ఇంటర్మీడియట్‌ బోర్డుదీ బాధ్యతేనని త్రిసభ్య కమిటీ అభిప్రాయపడింది.