ఐటీ గ్రిడ్స్ కేసు : అశోక్ ఎక్కడ ? 

  • Publish Date - March 14, 2019 / 01:47 AM IST

ఐటీ గ్రిడ్స్ కేసులో విచారణ వేగవంతం చేసింది సిట్. ఓవైపు ఈ కేసులో అసలు సూత్రదారులు ఎవరు.. డేటా లీకేజీ వెనక ఎవరెవరి హస్తం ఉందనే కోణంలో విచారణ జరుపుతూనే సీఈవో అశో‌క్ కోసం వేట ముమ్మరం చేశారు. ఇప్పటికే రెండు నోటీసులు ఇవ్వగా.. వాటికి అశోక్ స్పందించలేదు. బుధవారం విచారణకు హాజరవ్వాల్సి ఉన్నా.. అశోక్ అడ్రస్ లేదు. దీంతో… అశోక్ పై చర్యలకు సిట్ రంగం సిద్ధం చేసింది.

మాదాపూర్‌లోని ఐటీ గ్రిడ్స్‌, బ్లూఫ్రాగ్‌ సంస్థల్లో పోలీసులు సోదాలు నిర్వహించి హార్డ్‌డిస్క్‌లు సహా ఇతర ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. డేటా చౌర్యానికి సంబంధించి విచారణకు హాజరు కావాలని.. అశోక్‌కు మార్చి 2, 3 తేదీల్లో నోటీసులు జారీ చేశారు. అప్పటికే అజ్ఞాతంలోకి వెళ్లిన అశోక్‌ నోటీసులకు స్పందించలేదు. తాజాగా మార్చి 11వ తేదీ సోమవారం మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులను కేపీహెచ్‌బీలోని ఆయన ఇంటికి అంటించారు. గోషామహల్‌లోని సిట్‌ కార్యాలయంలో హాజరు కావాలని అందులో పేర్కొన్నారు.

అయితే.. ఇంటికి నోటీసులు అంటించినా అశోక్ విచారణకు హాజరు కాకపోవడంతో చర్యలకు సిట్ సిద్ధమవుతోంది. అశోక్ వ్యవహారంలో సిట్ న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటూ ముందుకెళ్తోంది. సీఆర్పీసీ సెక్షన్ 41 ప్రకారం అరెస్ట్ వారెంట్ జారీ చేయాలని సిట్ భావిస్తోంది. అశోక్ కోసం రెండు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. అశోక్ కాల్ డేటాతో పాటు లొకేషన్స్‌‌ను అధికారులు పరిశీలిస్తున్నారు.