సినీ నిర్మాత సురేష్ బాబు ఇంట్లో ఐటీ సోదాలు

  • Publish Date - November 20, 2019 / 03:58 AM IST

ప్రముఖ సినీ నిర్మాత డి. సురేష్ బాబు ఇంట్లో బుధవారం  తెల్లవారుఝూము నుంచి ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.  ఫిలింనగర్ లోని సురేష్ ప్రొడక్షన్స్ కార్యాలయం, రామానాయుడు స్టూడియో, సురేష్ బాబు ఇంట్లోనూ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సోదాల్లో కొన్ని కీలక పత్రాలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నాలుగు బృందాలుగా ఏర్పడి అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆ పత్రాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.  సోదాలు కొనసాగుతున్నాయి. 

కొన్నేళ్లుగా రామానాయుడు స్టూడియోకు సంబంధించిన ఆదాయ వివరాలపై సరైన పత్రాలు దాఖలు చేయక పోవడంతోనే ఈ దాడులు జరిగినట్టు చెబుతున్నారు. ప్రస్తుతం సురేశ్‌బాబు….. వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా వెంకీమామ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పలు సినిమాలకు డిస్ట్రిబ్యూటర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు.

ఇటీవలే మీడియాతో మాట్లాడిన సురేశ్‌బాబు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ధియేటర్లకు కరెంట్ బిల్లులు కూడా కట్టలేని పరిస్థితులు నెలకొన్నాయన్నారు. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల వల్ల ధియేటర్లకు వచ్చే ప్రేక్షకులు తగ్గిపోయారన్నారు. ప్రభుత్వంపై పరోక్ష విమర్శలు చేశారు.