ఆర్టీసీ సమస్యలపై చర్చించేందుకు జేఏసీ నేతలు సహకరించలేదని ఆర్టీసీ ఇంఛార్జ్ ఎండీ సునీల్‌శర్మ, రవాణాశాఖ కమిషనర్ సందీప్ సుల్తానియాలు చెప్పారు. కోర్టు ఆదేశాల ప్రకారం జేఏసీ కి చెందిన నలుగురు మాత్రమే పిలవాలని ఉంది… వారిని మాత్రమే చర్చలకు పిలిచామని చెప్పారు. ఒక ప్రధాన సమస్యపై చర్చించేటప్పుడు ఫోన్లు ఉంటే ఇబ్బంది ఉంటుందని ఫోన్లు వద్దని చెప్పామే తప్ప వేరే ఉద్దేశం లేదని ఆయన వివరించారు.
ఆర్టీసీ అధికారులు ఇచ్చిన సమయం కంటే గంట ఆలస్యంగా వచ్చినా మేము అనుమతించామని, చర్చల మధ్యలో కొన్ని సార్లు బయటకు వెళ్ళి వచ్చినా అనుమతించామని ఆయన చెప్పారు. శనివారం సాయంత్రం చర్చల మధ్యలో వారు బయటకు వెళ్లిపోయారని ఇంకా వస్తారని మేము ఇంతసేపటి వరకు ఎదురు చూసినా వారు రాలేదని సునీల్ శర్మ అన్నారు.
కోర్టు ఆదేశాల ప్రకారం 21 డిమాండ్ల పైన ఒకటి తర్వాత ఒకటి చర్చిద్దాం అని చెప్పినా జేఏసీ నాయకులు వినలేదని ఆయన ఆరోపించారు. చర్చలకు వారు ఎంత మాత్రం సహకరించకుండా 26 డిమాండ్ల పై చర్చలు జరపాలని పట్టుపట్టారని అన్నారు. ఇతర సభ్యులతో చర్చించి వస్తామని జేఏసీ నేతలకు బయటకు వెళ్లిపోయారు. అర్థాంతరంగా వెళ్లిపోయిన జేఏసీ నేతలు ఇప్పటి వరకు తిరిగి రాలేదని చర్చలు విఫలం కావటంతో ఈడీ కమిటీ విచారణ చేపడుతుందని శర్మ చెప్పారు. కార్మిక సంఘాలతో చర్చించటానికి మేము సిధ్దంగా ఉన్నామని ఆయన మరోసారి చెప్పారు.