బహిరంగ శిక్షలు వెయ్యాలి: ప్రియాంక రెడ్డి హత్యాచారంపై పవన్ కళ్యాణ్

  • Publish Date - November 29, 2019 / 01:13 PM IST

శంషాబాద్‌లో డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్యాచారం ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మూగజీవాలకు వైద్యం చేసే ప్రయాంకను మానవ మృగాలు అత్యాచారం చేయడాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలని అన్నారు పవన్ కళ్యాణ్. ప్రియాంక రెడ్డిపై సామూహిక అత్యాచారం చేసి చంపేసిన ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని అన్నారు పవన్ కళ్యాణ్. డాక్టర్ ప్రియాంక రెడ్డి కుటుంబానికి జనసేన తరపున, తన తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. 

యత్ర నార్యేస్తూ పూజ్యతే రమంతే తత్ర దేవతా.. అని మాట్లాడుకోవడానికి, రాసుకోవడానికి తప్ప ఆచరణలోకి తీసుకుని రావట్లేదు. ఇప్పుడు శంషాబాద్ ఘటన అనే కాదు.. కొద్ది రోజుల కిందట చిత్తూరు జిల్లాలో ఆడుకుంటున్న ఓ చిన్నారిని దుర్మార్గుడు చిదిమేశాడు. మొన్నటికి మొన్న వరంగల్‌లో ఓ ఇంటర్మీడియట్ విద్యార్ధినిపై ఓ కామాంధుడు లైంగిక దాడికి పాల్పడి చంపేశాడు.

ప్రభుత్వం నిర్భయ చట్టం తెచ్చినా కూడా బాలికలు, యువతులపై అత్యాచారాలు చేసేవాళ్లకు, వేదింపులకు పాల్పడేవాళ్లు భయ పడట్లేదు. ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్పడేవారిని బహిరంగంగా కఠినంగా శిక్షించాలి. సింగపూర్ లాంటి దేశాల్లో ఇటువంటి శిక్షలే అమల్లో ఉన్నాయి. పోలీస్ శాఖ సైతం షీ టీమ్స్‌ను మరింత బలోపేతం చేయాలి. శివారు ప్రాంతాల్లో పోలీస్ పెట్రోలింగ్, పర్యవేక్షణ పెంచాలి. వివ్యార్ధినుల్లో, యువతుల్లో ఆత్మస్థైర్యం పెంచడంతో పాటు ప్రాణ రక్షణకు మార్షల్ ఆర్ట్స్ నేర్పించాలి అని అన్నారు పవన్ కళ్యాణ్.