పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన పోటీ

  • Publish Date - November 17, 2020 / 04:44 PM IST

janasena ghmc elections: గ్రేటర్ హైదరాబాద్‌ ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు. గ్రేటర్‌ ఎన్నికల కోసం కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. గ్రేటర్ హైదరాబాద్‌ ఎన్నికల్లో పోటీ చేయాలని పలువురు కార్యకర్తల నుంచి వినతులు వచ్చాయని.. వారి కోరికను మన్నించి పోటీ చేయాలని నిర్ణయించామని పవన్ కల్యాణ్ ప్రకటించారు. పలు డివిజన్లలో జనసేన కమిటీలు ఇప్పటికే క్షేత్రస్థాయిలో పని చేస్తున్నాయని చెప్పారు.

జీహెచ్ఎంసీ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య ఈ ఎన్నికల్లో ప్రధానంగా పోరు సాగనుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో కలిసి బరిలో దిగి చేతులు కాల్చుకున్న కాంగ్రెస్ ఈసారి ఒంటరి పోరుకే సిద్ధపడుతున్నట్టు సమాచారం.

ఏపీలో బీజేపీ, జనసేన మధ్య పొత్తు ఉంది. కానీ తెలంగాణలో ఆ రెండు పార్టీల మధ్య ఎలాంటి పొత్తు లేదు. కాగా, దుబ్బాక ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న పవన్.. బీజేపీ విజయానికి పరోక్షంగా సహకరించారు. అయితే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని జనసేన ప్రకటించడం.. బీజేపీ అభిమానుల్లో టెన్షన్‌కు కారణమైంది.
https://10tv.in/janasena-pawan-kalyan-fires-on-jagan-government/
హైదరాబాద్‌లో స్థిరపడిన ఏపీ వాసులు, ముఖ్యంగా కాపులు జనసేనకు ఓటేసే అవకాశం ఉందనే భావన వ్యక్తం అవుతోంది. జనసేన అన్ని స్థానాల్లో పోటీ చేయకుండా.. కొన్ని స్థానాలకే పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనసేన అభ్యర్థులు బలంగా ఉన్న చోట్లు బీజేపీ డమ్మీ అభ్యర్థులను బరిలో దింపుతుందనే ప్రచారమూ సాగుతోంది. పైకి పొత్తు లేకున్నా.. ఒకరికొకరు సహకరించుకునే రీతిలో ఇరు పార్టీలు లోపాయికారిగా అవగాహనకు వచ్చే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. ఇలా చేయడం వల్ల సీమాంధ్ర ఓట్లు టీఆర్ఎస్, టీడీపీ, జనసేన మధ్య చీలిపోయి బీజేపీకి లబ్ధి చేకూరుతుందనే వాదన ఉంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించిన పవన్.. మరి సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పిస్తారా..? ఎలాంటి విమర్శలు చేస్తారు? అనేది ఆసక్తికరంగా మారింది.