తెలంగాణలో ఆర్టీసీ సమ్మె రోజురోజుకు ఉదృతం అవుతూనే ఉంది. ఈ క్రమంలో హైపవర్ కమిటీ నియమించాలంటూ హైకోర్టు సూచనలు చేయగా.. అందుకు ఒప్పుకోలేదు ప్రభుత్వం. హైపవర్ కమిటీ నియామకం విషయంలో హైకోర్టుకి ఈ మేరకు ప్రభుత్వం అభిప్రాయం తెలిపింది.
ఈ క్రమంలోనే తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ విధానాల్లో కోర్టులు జోక్యం చేసుకోలేవని, పరిపాలనలో ప్రభుత్వానికి పూర్తి స్వేచ్ఛ ఉంటుందని వెల్లడించారు. బడ్జెట్, విధానపరమైన నిర్ణయాల్లో కోర్టులు చేయలేవని, ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో ఇరుపక్షాలు సామరస్యంగా పరిష్కరించుకోడమే మార్గం అని జేపీ సూచించారు.
ఇదిలా ఉంటే మరోవైపు ఆర్టీసీ కార్మికులతో మళ్లీ చర్చలకు వెళ్లాల్సిన అవసరం లేదని ప్రభుత్వం భావిస్తోంది. కార్మిక శాఖతో జరిగిన చర్చల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోకముందే కార్మిక నేతలు బయటకు వచ్చేశారని, అలాంటపుడు మళ్లీ చర్చలు జరపాల్సిన అవసరం ఏమిటనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది ప్రభుత్వం. మరోవైపు ఆర్టీసీ జేఏసీ మాత్రం చర్చలకు సిద్ధం అంటుంది.