డేటా చోరీ వివాదం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను కుదిపివేస్తుంది. ఆంధ్రలోని అధికార, ప్రతిపక్షాలు.. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు దమ్మెత్తి పోసుకుంటున్నారు. ఈ క్రమంలో తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు మంత్రి కళా వెంకట్రావు, వైకాపా అధ్యక్షుడు జగన్‌కు బహిరంగ లేఖ రాశారు. దొంగ ఓట్లు-దొంగ నోట్ల బ్యాచ్ ఒక చోటుకు చేరినట్టు జగన్-కేటీఆర్ మధ్య దోస్తీ ఏర్పడి ఒక చోటుకు చేరారంటూ విమర్శించారు.
ప్రధాని మోడీ ఆడుతున్న ఆటలో జగన్, కేసీఆర్ పావులుగా మారారంటూ ఆరోపించారు. వికృత రాజకీయాలతో వ్యవస్థలకే కళంకం తెచ్చేలా వైకాపా, తెరాస వైఖరి ఉందని, అధికారం కోసం రాష్ట్ర ప్రతిష్ఠను దిగజార్చేలా వైకాపా కుట్రలు, కుయుక్తులు పన్నుతుందని మండిపడ్డారు. ఆన్‌లైన్‌లో ఉన్న ఓటరు జాబితాను ఎవరైనా వాడుకోవచ్చని ఎన్నికల సంఘమే చెప్పిందని, తెలుగుదేశం కార్యకర్తల డేటాను జగన్‌కు ఇవ్వడమేనా కేసీఆర్ ఇస్తానన్న రిటర్న్ గిఫ్ట్ అంటూ ఆయన ప్రశ్నించారు.
కేసీఆర్ కుటుంబానికి జగన్ సామంతరాజుగా మారారని, ఏపీపై కత్తి కట్టిన కేసీఆర్, మోడీలతో జగన్ కలవడం రాష్ట్ర ద్రోహమని అన్నారు. ఎన్నికల సంఘం ప్రకటించిన ఓటర్ల జాబితానే పార్టీలన్నీ వాడుకుంటున్నాయని.. ఆ డేటాను ఐటీ గ్రిడ్స్ సంస్థ వాడుకుంటే తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఓటర్లను రాష్ట్ర ప్రభుత్వం ఎలా తొలగిస్తుందంటూ నిలదీశారు.