నీటి కష్టాలకు చెక్ : నిజామాబాద్, మెదక్‌లపై సర్కార్ నజర్

  • Publish Date - September 20, 2019 / 12:46 AM IST

కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ద్వారా 45 లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తామని సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటించారు. ప్రాజెక్ట్‌ల కోసం అప్పులు తెచ్చామని ప్రతిపక్షాలు అపోహపడాల్సిన పని లేదన్నారు. సాగునీటి ప్రాజెక్ట్‌ల ద్వారా సత్ఫలితాలు వస్తున్నాయని సెప్టెంబర్ 19వ తేదీ గురువారం శాసనసభ దృష్టికి తెచ్చారు. 

ఇదిలా ఉంటే..నిజామాబాద్‌ జిల్లాలో తాగు, సాగు నీటి సమస్యకు పరిష్కారంగా కాళేశ్వరం జలాలను తరలించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. సాగునీరు, తాగునీరు అందించేందు సమగ్ర ప్రణాళికను రూపొందించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. త్వరలోనే నిజామాబాద్ జిల్లాలో పర్యటించాలని నిర్ణయించారు. 
నిజామాబాద్, మెదక్ జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాలకు సాగు, తాగు నీరు అందించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది.

నిజామాబాద్‌ జిల్లా పరిధిలోని ఎమ్మెల్యేలు, అధికారులతో భేటీ అయిన కేసీఆర్ సమస్య పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. నిజాంసాగర్‌, సింగూరులో నీటి లభ్యత తక్కువగా ఉన్నందున ఆ ప్రాజెక్టుల పరిధిలోని గ్రామాలకు ఈ ఏడాది మంచినీరు అందించడానికి ప్రత్యామ్నాయ, తాత్కాలిక ప్రణాళిక రూపొందించాలని సీఎం అధికారులకు సూచించారు. ప్రస్తుతం ఉన్న జలాశయాలకు నీటి లభ్యత తక్కువగా ఉండటంతో కాళేశ్వరం జలాలను తరలించేందుకు అనుగుణంగా ప్రత్యామ్నాయాలను చూడాలని చెప్పారు. 

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎస్సారెస్పీని లింక్ చేస్తే భవిష్యత్‌లో ఎస్సారెస్పీ ఆయకట్టుకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు కేసీఆర్. గుత్ప, అలీసాగర్‌లలాగే లిఫ్టులుపెట్టి బాన్సువాడ, బాల్కొండ నియోజక వర్గాలకు సాగునీరు అందివ్వాలని సూచించారు. వెంటనే సర్వే జరిపి లిప్టులు, ఎక్కడ పెట్టి ఏఏ గ్రామాల పరిధిలో ఎన్ని ఎకరాలకు నీరందించవచ్చో తేల్చాలని నీటిపారుదలశాఖ అధికారులను సీఎం ఆదేశించారు.

ఏటా 90 టీఎంసీలకు తక్కువ కాకుండా  ఎస్పారెస్పీని నింపాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని నుంచి ఎంత వీలయితే అంత ఆయకట్టుకు నీరివ్వాలని కేసీఆర్ సూచించారు. ఈ ఒక్కఏడాదే సింగూరు, నిజాంసాగర్‌ పరిధిలో ఈ సమస్య ఉంటుందని, వచ్చే ఏడాదినాటికి మల్లన్న సాగర్‌ నుంచి ఈ రెండు ప్రాజెక్టులకు నీరందుతుందని చెప్పారు. వచ్చే వేసవిలో ప్రజలు ఇబ్బందులు పడకుండా ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
Read More : 23 నుంచి బతుకమ్మ చీరల పంపిణి