కర్ణాటకలోని నారాయణపుర ప్రాజెక్టు నుంచి దిగువకు విడుదల చేసిన కృష్ణా జలాలు జూరాల ప్రాజెక్టు వద్దకు మే 14వ తేదీ అర్ధరాత్రి చేరుకున్నాయి. కృష్ణా, మాగనూరు, మక్తల్, నర్వ, అమరచింత మండలాలను దాటుకుంటూ జూరాల వైపు పరుగులు తీసింది కృష్ణమ్మ. సాయంత్రం 4 గంటల సమయంలో ముస్లాయపల్లికి చేరుకున్న జలాలు రాత్రి 8గంటలకు అనుగొండను దాటాయి. రాత్రి 10గంటలకు ముష్టిపల్లి, అర్ధరాత్రి 12గంటల సమయంలో జూరాలకు చేరుకున్నాయి.
గిరిజాపూర్ బరాజ్ నుంచి ప్రస్తుతం మూడు గేట్లు తెరిచి నిరంతరాయంగా దిగువకు నీటిని వదులుతున్నారు అధికారులు. మే 08వ తేదీన అర్ధరాత్రి నారాయణపుర ప్రాజెక్టు నుంచి జూరాలకు నీటిని విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో జూరాల వద్ద నీటిమట్టం క్రమంగా పెరిగే అవకాశం ఉందని ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి నిల్వ 1.86 టీఎంసీ మాత్రమే ఉంది. దీనివల్ల తాగునీటి పథకాలకు నీటి విడుదల కష్టంగా మారింది. రామన్ పాడుకు నీటిని తరలించే ఎడమకాల్వ గేట్ల వద్ద కూడా రిజర్వాయర్‌లోని నీటిని తరలించడం వీలు కాలేదు. ఉమ్మడి పాలమూరు ప్రజలకు తాగునీటి కష్టాలు ఎదురయ్యాయి.
ఈ తరుణంలో కర్ణాటక సీఎం కుమార స్వామితో..సీఎం కేసీఆర్ మాట్లాడారు. నారాయణపుర ప్రాజెక్టు నుంచి జూరాలకు తాగునీటి కోసం 2.5 టీఎంసీలను వదలాలని కోరారు. నారాయణపుర నుంచి 2.5 టీఎంసీలలో గూగల్ బరాజ్‌కు 2 టీఎంసీల కంటే తక్కువ నీరు చేరినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇక్కడి నుంచి జూరాలకు వచ్చే క్రమంలో మరింత తగ్గే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. రామన్ పాడుకు 0.1 టీఎంసీ నీటిని అందించింనా ఉమ్మడి పాలమూరు జిల్లాకు తాగునీటి కష్టాలు తీరుతాయని భావిస్తున్నారు. జూన్ మొదటి వారంలో వర్షాలు కురిసే వరకు జూరాలపై ఆధారపడిన తాగునీటి పథకాలన్నింటికీ ఎంతో ఉపయోగంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు అధికారులు.