కేసీఆర్ టీమ్ ఇదే : కేబినెట్ విస్తరణకు ఏర్పాట్లు

  • Publish Date - February 18, 2019 / 03:25 AM IST

హైదరాబాద్: మంగళవారం(ఫిబ్రవరి-19-2019) జరిగే రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు రాజ్‌భవన్‌లో ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఇప్పటికే కేసీఆర్‌ టీమ్‌ ఖరారైనట్లుగా తెలుస్తోంది. సామాజిక వర్గాల సమీకరణలు, సమర్ధత ఆధారంగా సీఎం తన టీమ్‌ను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం 9మంది ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. మంగళవారం ఉదయం 11గంటల 30 నిమిషాలకు కొత్త మంత్రులతో గవర్నర్‌ నరసింహన్‌ ప్రమాణం చేయిస్తారు.

 
ఇదిలావుంటే…కేబినెట్‌లో ఎవరికి అవకాశం దక్కుతుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. అయితే సీఎం కేసీఆర్‌ ఇప్పటికే తన మంత్రివర్గాన్ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో పాతవారితో పాటు కొత్తవారికి కూడా అవకాశం దక్కనున్నట్లు సమాచారం. మొత్తం 9మందికి మంత్రి పదవులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. విస్తరణ జరిగిన వెంటనే శాఖల కేటాయింపు ఉత్తర్వులు జారీకి  ఏర్పాట్లు జరుగుతున్నాయి. సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా ఇప్పటికే శాఖల పునర్వ్యవస్ధీకరణ జరిగింది. మొత్తం 34 శాఖలను 18 శాఖలకు కుదించారు. 

 

ఇక కేసీఆర్‌ టీమ్‌లో వేముల ప్రశాంత్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, కొప్పుల ఈశ్వర్‌లకు మంత్రి పదవులు దాదాపు ఖరారయ్యాయి. అటు పద్మారావుకు డిప్యూటీ స్పీకర్‌ పదవి ఇవ్వనున్నారు. ఇక ఆదిలాబాద్ జిల్లా నుంచి ఇంద్రకరణ్‌రెడ్డి లేదా జోగు రామన్నకు.. నల్గొండ నుంచి జగదీష్‌రెడ్డి లేదా గుత్తా సుఖేందర్‌రెడ్డికి మంత్రివర్గంలో చోటు దక్కవచ్చు. అటు మహిళా కోటాలో పద్మా దేవేందర్‌రెడ్డి లేదా గొంగిడి సునీతారెడ్డికి చాన్స్‌ ఉంది. ఎస్టీ కోటాలో రెడ్యానాయక్‌ లేదా రేఖానాయక్‌కు అవకాశం దక్కుతుందని టీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి.

 

కేటీఆర్‌, హరీష్‌రావు, ఈటెల రాజేందర్‌, కడియం శ్రీహరిలకు కేబినెట్‌లో చోటు ఉండబోదని టీఆర్‌ఎస్‌ వర్గాలంటున్నాయి. సంచలన నిర్ణయాలు తీసుకునే సీఎం కేసీఆర్ చివరి నిమిషంలో ఎవరికి అవకాశమిస్తారో ఎవరిని పక్కకు పెడతారో అన్నది ఆసక్తికరంగా మారింది. మంగళవారం జరిగే మంత్రివర్గ విస్తరణ కోసం రాజ్‌భవన్‌ వద్ద  భద్రత ఏర్పాట్లపై పోలీసులు, ఇతర భద్రతా సిబ్బంది ఇప్పటికే రిహార్సల్స్‌ నిర్వహించారు. అలాగే మంగళవారం రాజ్‌భవన్‌ రోడ్డులో ట్రాఫిక్‌ నియంత్రణ చర్యలు చేపట్టనున్నారు.