వికారాబాద్ : జగన్ తో కలిసి ఏపీకి ప్రత్యేక హోదా తీసుకువస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయం పై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవల ఎన్నికల ప్రచార సభల్లో చేస్తున్న వ్యాఖ్యలకు కేసీఆర్ సోమవారం కౌంటర్ ఇచ్చారు. ఏపీ ప్రత్యేక హోదాపై తామెప్పుడూ అడ్డుపడలేదని , ప్రత్యేక హోదాపై ఏపీకి సహకరిస్తామని ఆయన చెప్పారు.వికారాబాద్ లో జరిగిన టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ .. గతంలో పార్లమెంటులో టీఆర్‌ఎస్ ఎంపీలు ఎన్నోసార్లు ఏపీ కి ప్రత్యేక హోదా అంశంపై మాట్లాడారని చెప్పారు. మరోసారి తెలంగాణ గడ్డ నుంచి చెబుతున్నాను….. ప్రత్యేక హోదా విషయంలో తమ సంపూర్ణ మద్దతు ఏపీకి ఉంటుందని కేసీఆర్ పునరుద్ఘాటించారు. ఏపీలో జగన్ గెలుస్తున్నాడని, తెలంగాణా ఎంపీలు17 మంది , ఏపీకు చెందిన ఎంపీలు మొత్తం 36 మంది కలిసి హోదాపై పోరాడతామని ఆయన చెప్పారు.
చంద్రబాబులాగా చీకటి పనులు తాము చేయనని కేసీఆర్ అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు తామెప్పుడూ అడ్డుపడలేదని,చంద్రబాబుకే కట్టటం చేతకాలేదని విమర్శించారు. తాము తెలంగాణ ముంపును వ్యతిరేకించాము తప్ప ప్రాజెక్టు నిర్మాణాన్ని ఎప్పుడు అడ్డుకోలేదని కేసీఆర్ స్పృష్టం చేశారు. కాగా గోదావరి లో తెలంగాణకు రావాల్సిన 1000 టీంఎసీ నీళ్ల కేటాయింపు ఉందని వాటిని ఖచ్చితంగా వాడుకుంటామని ఆయన తేల్చి చెప్పారు. ఈనేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు పై ఆయన మండిపడ్డారు. “ఆంధ్రా ప్రజలు మంచివాళ్లు.. వాళ్లతో మాకేం కిరికిరి లేదు. చంద్రబాబు లాంటి పిడికెడు మందితో తప్ప ఏపీ ప్రజలతో మాకు పంచాయతీ లేదు. చంద్రబాబులాంటి కుట్రలు మేము చేయమని కేసీఆర్ అన్నారు.