గెలిపించే బాధ్యత వాళ్లదే.. 15నుంచి కేసిఆర్ ప్రచారం

  • Publish Date - March 12, 2019 / 04:00 AM IST

తెలంగాణలో 16 ఎంపీల‌ను గెలిపించాల్సిన ఎమ్మెల్యేలపైనే ఉందని ముఖ్యమంత్రి కేసిఆర్ వారికి స్పష్టం చేశారు. లోక్ స‌భ ఎన్నిక‌లకు సంబంధించి ఎమ్మెల్యేల‌తో మాట్లాడిన కేసిఆర్.. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్‌కు పెద్దగా బలం లేదని, అయినా కూడా అలసత్వం వహించవద్దంటూ కేసిఆర్ ఎమ్మెల్యేలకు సూచించారు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఖ‌మ్మం లాంటి చోట్ల పార్టీ నాయ‌కుల మ‌ధ్య స‌మన్వయం లోపించింద‌నీ, ఈసారి అలాంటి పొర‌పాటు జ‌ర‌గ‌కూడ‌ద‌ని చెప్పారు.  అందరూ ఒళ్లు ద‌గ్గ‌ర‌పెట్టుకుని ప‌నిచేయాల‌ని హెచ్చరించారు. అలాగే ఈ నెల(మార్చి) 15వ తేదీ నుంచి పార్లమెంటు ఎన్నికలకు ప్రచారం నిర్వహించనున్నట్లు కేసిఆర్ స్పష్టం చేశారు. 
పార్లమెంటుకు పోటీ చేయబోయే అభ్యర్ధుల వివరాలను ప్రకటించి మార్చి 15న క‌రీంన‌గ‌ర్‌, 19న నిజామాబాద్‌లలో భారీ బ‌హిరంగ స‌భ‌ల‌ను నిర్వహించనున్నట్లు కేసిఆర్ వెల్లడించారు. వ‌రుస‌గా 8 బ‌హిరంగ స‌భ‌ల్లో, రెండు పార్లమెంటు నియోజకవర్గాలకు కలిపి ఒక స‌భ ఉండేట్టుగా ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు టిక్కెట్ల విషయానికి వస్తే ముగ్గురు ముగ్గురు సిట్టింగు ఎంపీల‌ను మార్చే అవ‌కాశం కనిపిస్తుంది. ఖ‌మ్మం, మ‌హ‌బూబ్ న‌గ‌ర్‌, మెహ‌బుబాబాద్ పార్లమెంటు స్థానాల అభ్యర్ధుల విషయంలో కూడా ఇంకా స్పష్టత రాలేదు.