దేవభూమిగా ఎర్రవల్లి : జనవరి 25న ముగియనున్న యాగం

  • Publish Date - January 24, 2019 / 03:31 PM IST

సిద్ధిపేట : వేద మంత్రాలు.. పురాణ ఇతిహాస పారాయణాలు, వేదోక్తమైన హవనాలు, నవగ్రహారాధనలతో సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి దేవభూమిగా మారింది. మంగళనీరాజనాలు, జపతపాలతో తపోభూమిగా పరివర్తనం చెందింది. రాష్ట్ర ప్రజల సుఖ సంతోషాల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు సంకల్పించిన మహారుద్ర సహిత సహస్ర చండీయాగం  కన్నులపండువగా సాగుతోంది. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో శ్రీ సహస్ర మహా చండీయాగం నాలుగోరోజు వైభవంగా జరిగింది.  

దేవభూమిగా మారిన ఎర్రవల్లి 
నాలుగో రోజు కొనసాగిన శ్రీ సహస్ర మహా చండీయాగం
శుక్రవారం మధ్యాహ్నం పూర్ణాహుతితో ముగియనున్న యాగం

ఉదయం యాగశాలకు సతీసమేతంగా వచ్చిన ముఖ్యమంత్రి మొదట రాజశ్యామల మాత మంటపంలో పూజలు నిర్వహించారు. శ్రీ మహాకాళి , మహాలక్ష్మి , మహా సరస్వతి , స్వరూపిణిగా శ్రీ రాజశ్యామలాదేవిని సువర్ణ మంత్ర పుష్పాంజలితో సీఎం దంపతులు ప్రార్ధించారు . సర్వ మంగళ మాంగల్యే … శ్రీ రాజశ్యామలా దైవేయ నమస్తే … అంటూ ఋత్వికులు వేదోక్తంగా ప్రార్థనలు చేశారు. రాజశ్యామల మంటపంలో సీఎం దంపతులకు వేద పండితులు ఆశీర్వచనం ఇచ్చారు . 

అనంతరం మహారుద్ర మంటపంలో జరిగిన పూజలో సీఎం పాల్గొన్నారు. మహారుద్ర సహిత రుద్ర ఏకాదశిని పఠన రుద్ర నమకం, రుద్ర చమకం పటించారు. పంచాక్షరి జపంలో భాగంగా శివశివ శంకర భూత పతే, శంకర శివ, శంభో మహాదేవ, హరహర మహాదేవ అనే ప్రార్ధనలు యాగశాలలో మారుమోగాయి. సీఎం దంపతుల సమక్షంలో వేదపండితులు, ఋత్వికులు పూజలు చేశారు. గౌరీ నారాయణ నమస్తుతే, పీతాంబర దేవీ నమస్తుతే, జయతే, విజయతే, జయ విమలే బగలే అంటూ దేవిని స్తుతించారు. శతమానం భవతి అంటూ పండితులు సీఎం దంపతులను దీవించారు. కన్నుల పండువగా సాగుతోన్న ఈ సహస్ర మహా చండీ యాగము జనవరి 25వ తేదీ మధ్యాహ్నం  పూర్ణాహుతి కార్యక్రమంతో ముగియనుంది.