ఎల్బీనగర్ ఫ్లై ఓవర్ నుండి ఎప్పుడు వెళుదామా ? ట్రాఫిక్ చిక్కుల నుండి బయటపడుదామా ? అనుకుంటున్న వాహనదారుల కల నెరవేరబోతోంది. రూ. 42 కోట్ల రూపాయలతో నిర్మించిన ఫ్లై ఓవర్ మార్చి 1వ తేదీన ఓపెన్ కానుంది. దీనివల్ల ట్రాఫిక్ చిక్కులు తప్పనున్నాయి. ఇక సిగ్నల్ కోసం ఆగాల్సిన అవసరం ఉండదు. ఈ మార్గంలో సాఫీగా సాగిపోవచ్చు. ఫ్లై ఓవర్ వల్ల దిల్ సుఖ్ నగర్ నుండి విజయవాడ వెళ్లే మార్గంలో ట్రాఫిక్ సమస్యలు ఇంక ఉండవు. ఏడాది సమయంలోనే దీనిని పూర్తి చేసినా ప్రారంభోత్సవం కోసం వాయిదా పడుతూ వస్తోంది. ప్రారంభోత్సవానికి మంత్రులు మహమూద్ ఆలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, ఎమ్మెల్యే డి.సుధీర్ రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్ గౌడ్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ తదితరులు పాల్గొననున్నారు.
వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి పథకం (ఎస్ఆర్‌డీపీ) ఫస్ట్ ఫేజ్‌లో భాగంగా ఎల్‌బీనగర్ జంక్షన్‌ను అభివృద్ధి చేసేందుకు ఫ్లై ఓవర్‌ను నిర్మించారు. ఎల్‌బీనగర్ ఎడమవైపు ఫ్లై ఓవర్ పనులు పూర్తి అయ్యాయి. దీనివల్ల దిల్‌సుఖ్‌నగర్ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలు ఎల్బీనగర్ వద్ద నిలపాల్సిన అవసరం ఉండదు. కుడివైపు ఫ్లై ఓవర్‌తో పాటు అండర్‌పాస్ నిర్మాణం పూర్తైతే సిగ్నల్ ఫ్రీ జంక్షన్‌గా మారుతుంది.
ఎల్బీ నగర్ ఫ్లై ఓవర్ విశేషాలు :
* వ్యయం – రూ. 42 కోట్లు.
* పొడవు – 780 మీ
* వెడల్పు – 12మీ
* ర్యాంపుల పొడవు – 400 మీ.
* క్యారేజ్ వే – 11 మీ
* ఫ్లై ఓవర్ ఎత్తు – 5.5మీ
* వాహనాలు వెళ్లేందుకు – 11మీ
* టెక్నాలజీ – ప్రీకాస్ట్