హైదరాబాద్ : కొబ్బరిబొండాల కత్తితో ప్రేమోన్మాది దాడి చేసిన ఘటనలో తీవ్రంగా గాయపడిన మధులిక ఆరోగ్యం క్రమంగా కుదురుపడుతోంది. ఫిబ్రవరి 6న దాడి జరిగిన నాటి నుంచి ఐసీయూలోనే చికిత్సనందిస్తున్న డాక్టర్స్ మధులిక కోలుకోవటంతో జనరల్ వార్డ్ కు తరలించారు.
ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన మధులికకు పలు సర్జరీలు చేశామనీ..ట్రీట్ మెంట్ కు సహకరించిన మధులిక శరీరం త్వరగానే కోలుకుందనీ..వెంటిలేటర్ ను కూడా తొలగించి జనరల్ వార్డ్ కు తరలించి అబ్జర్వేషన్ లో ఉంచామని డాక్టర్లు చెప్పారు. కోలుకుంటున్న మధులిక తన కుటుంబసభ్యులతో మాట్లాడుతోందన్నారు. ఆరోగ్యం నిలకడగా ఉంటే వారం రోజుల్లోనే డిశ్చార్జి చేస్తామని డాక్టర్లు తెలిపారు.
బర్కత్‌పుర వద్ద ప్రేమోన్మాది భరత్ కొబ్బరి బోండాలు నరికే కత్తితో మధులికపై విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో ఆమెకు తలతో పాటు 15 చోట్ల కత్తిపోట్లకు గురయ్యింది. తీవ్ర గాయాలతో మలక్‌పేటలోని యశోద ఆసుపత్రికి తరలించటం..తీవ్ర రక్తస్రావం కావడంతో 74 గంటలపాటు అపస్మారక స్థితిలోనే ఉండిపోయింది. అతి క్లిష్టంగా ఉన్న పరిస్థితి నుంచి యశోదా ఆస్పత్రిలోని 10మంది డాక్టర్లు మధులికను నిరంతర పర్యవేక్షించారు. ఈ క్రమంలో మధులిక క్రమంగా కోలుకుంది. మధులికపై దాడికి పాల్పడిన భరత్ ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్నాడు.