జూబ్లీ హిల్స్ లో టీటీడీ ఆధ్వర్యంలో నూతనగా నిర్మించిన శ్రీవెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో మార్చి 13న విగ్రహ ప్రతిష్ట, మహాకుంభాభిషేకం జరుగుతుంది.
జూబ్లీ హిల్స్ లో టీటీడీ ఆధ్వర్యంలో నూతనగా నిర్మించిన శ్రీవెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో మార్చి 13న విగ్రహ ప్రతిష్ట, మహాకుంభాభిషేకం జరుగుతుంది. అందులో భాగంగా శుక్రవారం అంకురార్పణ చేయనున్నారు. శుక్రవారం నాడు అంకురార్పణ సమయంలో టీటీడీ వేదపండితులు ఆచార్యరిత్విక్ వరణం, మృత్సంగ్రహణం, వేదారంభం కార్యక్రమాలు చేపట్టనున్నారు. మార్చి 13న ఉదయం 6 గంటల నుంచి మహా కుంబాభిషేకం నిర్వహించి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.
Also Read : 100 డైనమేట్లతో పేల్చేశారు: నీరవ్ మోడీ రూ.100 కోట్ల భవనం నేలమట్టం
వైఖానస ఆగమశాస్త్రం ప్రకారం మార్చి9 శనివారం నుండి 12వ తేదీ మంగళవారం వరకు ఉదయం సాయంత్ర వేళల్లో యాగశాల వాస్తు, పంచగవ్య ప్రసన్నం, వంటి పూజలు, అవసరమైన హోమాలు నిర్వహిస్తారు. మార్చి 13వ తేదీ తెల్లవారుఝూమున గం.2.30 నుండి 5.30 వరకు సుప్రభాతం, నివేదన, హోమం, మహాపూర్ణాహుతి నిర్వహిస్తారు. ఉదయం గం.5.30 నుండి 6 గంటలవరకు ఉత్సవమూర్తులను ఊరేగిస్తారు.
ఉదయం గం.6 నుంచి గం.7.30 వరకు మహా కుంభాభిషేకం నిర్వహిస్తారు. అనంతరం బ్రహ్మఘోష, ధ్వజారోహణం నిత్యకైంకర్యాలు నిర్వహించి సర్వదర్సనం కల్పిస్తారు. సాయంత్రం గం.4 నుండి 5.30 వరకు శ్రీనివాసకళ్యాణం నిర్వహిస్తారు. ఈ ఆలయంలో పుష్కరిణి, మహాగణపతి ఆలయం కూడా ఉన్నాయి.
టీటీడీ ఆధ్వర్యంలో ఇప్పటికే హిమాయత్ నగర్ లో ఒక వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్వహిస్తున్నారు. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబరు 92 లోని టెలిఫోన్ కాలనీలో3.7 ఎకరాల్లో టీటీడీ రెండవ ఆలయాన్ని నిర్మించింది. 2016 ఆగస్టు 10 న అప్పటి టీటీడీ ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి శంకుస్దాపన చేశారు. ఈ దేవాలయం నిర్మాణానికి రూ. 13.90 కోట్లు ఖర్చయ్యింది.