తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుంచి కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆశాభావం వ్యక్తం చేశారు. మర్కజ్ మసీదు యాత్రికుల కేసులు లేకపోతే కరోనా రహిత రాష్ట్రంగా తెలంగాణ ఉండేదని ఈటల అన్నారు. వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిలో 60 నుంచి 70 మంది శుక్రవారం, ఏప్రిల్ 10న, డిశ్చార్జి అయ్యే అవకాశం ఉందన్నారు.
ప్రజలందరూ స్వచ్ఛందంగా లాక్‌డౌన్ పాటించడం వల్లే కరోనా కేసులు రాష్ట్రంలో తగ్గుముఖం పట్టాయన్నారు. ప్రస్తుతం ఉన్న రోగులు ఏప్రిల్ 24వ తేదీ లోపు కోలుకునే అవకాశం ఉందన్నారు. ఏప్రిల్ 9, గురువారం ఒక్కరోజే 665 నమూనాలు పరీక్షిస్తే 18 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని ఈటల తెలిపారు. తెలంగాణలో 101 హాట్‌స్పాట్‌లను గుర్తించామన్నారు. ఈ ప్రాంతాల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.
రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 471కి చేరుకున్నట్లు మంత్రి చెప్పారు. గురువారం 18 పాజిటివ్ కేసులు రాగా, ఒకరు మృతి చెందారని మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 12కు చేరింది. ఇక 471 పాజిటివ్ కేసుల్లో 385 మంది మర్కజ్ వెళ్లొచ్చిన వారు, వారిని కలిసి వ్యక్తులు ఉన్నారని మంత్రి తెలిపారు. ఇప్పటి వరకు 45 మంది ఈ వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారని పేర్కొన్నారు.
ప్రజలకు జలుబు దగ్గు, జ్వరం లక్షణాలతో అనుమానం వస్తే వెంటనే ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులను సంప్రదించాలని కోరారు. కరోనా పాజిటివ్ రోగులను గాంధీ అస్పత్రిలో చికిత్స అందిస్తున్నామని చెప్పారు. మిగిలిన వారికి వివిధ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నామన్నారు. కరోనా కేసులు కాక…ఇతర ప్రాణాంతక వ్యాధులతో బాధపడే పేషెంట్లకు పూర్తి స్ధాయిలో రవాణా సౌకర్యం కల్పించి వారికి వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు.
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో టెలీ మెడిసిన్ సౌకర్యాన్ని ప్రవేశ పెడతామని….సైకలాజికల్ గా ఇబ్బందులు ఎదుర్కోనే వారికి కూడా ఫోన్ ద్వారా వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నామని… శుక్ర వారం అందుకు సంబంధించిన ఫోన్ నెంబర్ ప్రకటిస్తామని చెప్పారు.
విదేశాల నుంచి వచ్చిన వారి వల్ల… మర్కజ్ మసీదు కు వెళ్లి వచ్చిన వారికి మాత్రమే కరోనా సోకిందని..స్వతహాగా రాష్ట్రంలో ఎవరికీ కరోనా రాలేదని చెప్పారు. ప్రజలందరూ ఇప్పటి వరకు పాటించిన క్రమ శిక్షణను ఇదే కమిట్ మెంట్ తో పాటించాలని ఈటల కోరారు.