తెలంగాణ ప్రభుత్వం తీసుకుని రాబోతున్న నూతన చట్టం కఠినంగా ఉంటుందని, ప్రభుత్వ ఉద్యోగులను ఈ చట్టంతో భయపెట్టడం మా అభిమతం కాదని, కానీ తప్పు చేయాలనుకునే ఉద్యోగికి మాత్రం గుండెల్లో వణుకు పుట్టేలా ఈ చట్టం ఉంటుందని ఐటీశాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
తమది ఫ్రెండ్లీ ప్రభుత్వమని, కొత్త పురపాలక చట్టంపై ఉద్యోగులు, ప్రజల్లో అవగాహన తీసుకుని రావాలని కేటీఆర్ అన్నారు. మునిసిపల్ కమిషనర్ల సమీక్షలో మాట్లాడిన కేటీఆర్.. ఈ మరకు కొన్ని సూచనలు చేశారు. అలాగే ఎవరైనా ఇళ్ల నిర్మాణ అనుమతికి సంబంధించి సర్టిఫికేట్ విషయంలో తప్పులు ఉంటే తొలివారంలోనే తిరస్కరించాలని కమిషనర్లకు సూచించారు.
కొత్త చట్టం ప్రకారం 21రోజుల వరకు కమిషనర్లు స్పందించకుంటే పత్రాలు సమర్పించిన వారికి అనుమతులు లభించినట్లేనని అన్నారు మంత్రి కేటీఆర్. ఈ తరహా ఘటనలు ఎక్కువైతే మాత్రం సదరు కమిషనర్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు. పనితీరును బట్టి సిబ్బందిని ఇతర ప్రాంతాలకు బదిలీచేసే అవకాశం కొత్త చట్టంలో ఉందని అన్నారు. పురపాలక సంఘాల అభివృద్ధికి వనరులు సమృద్ధిగా ఉన్నాయని కేటీఆర్ వెల్లడించారు.