ఆర్టీసీ సమ్మె : విలీనం ప్రసక్తే లేదు..స్పష్టం చేసిన మంత్రి పువ్వాడ

  • Publish Date - October 12, 2019 / 07:54 AM IST

ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మెపై మరోసారి ప్రభుత్వం స్పందించింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు మంత్రి పువ్వాడ అజయ్. ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 8వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లు, ప్రత్యామ్నాయ చర్యలను అక్టోబర్ 12వ తేదీ శనివారం మీడియాకు వివరించారు. సమ్మెలో 5 వేలకు పైగా బస్సులు నడుపుతూ ప్రజలకు ఇబ్బంది కలుగకుండా చూస్తున్నామన్నారు. 

ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చలేదని, సీఎం కేసీఆర్ కూడా ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేశారు. దసరా పండుగ సందర్బంగా సొంత ఊళ్లకు వెళ్లే పరిస్థితుల్లో, ప్రజలకు అసౌకర్యం కల్పించాలనే ఉద్దేశ్యంతో యూనియన్లు చేసిన ప్రయత్నాన్ని ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం సమర్థవంతంగా ఎదుర్కొందన్నారు. ప్రజలను గమ్యస్థానాలకు చేర్చడం..తిరిగి వారిని క్షేమంగా ఇళ్లకు చేర్చడంలో విజయవంతమయ్యామన్నారు. ప్రధానంగా సంప్రదింపుల ప్రక్రియ ముగియకముందే..సమ్మెని ప్రజల మీద బలవంతంగా రుద్దారన్నారు.

మధ్యలోనే వెళ్లిపోయింది కార్మిక సంఘ నేతలన్నారు. సమ్మె చట్టవిరుద్ధమైందని మరోసారి వ్యాఖ్యానించారు. 2 వేల 969 ఆర్టీసీ బస్సులు, హైయ్యర్ బస్సులు 15 వందల 88, ప్రైవేటు బస్సులు 798, ఇతర ప్రైవేటు వాహనాలు 2 వేల వాహనాలతో నడపడం జరుగుతోందన్నారు. ఇక్కడ ప్రతిపక్షాలు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నాయని, కార్మిక సంఘాలు చేపట్టిన సమ్మెకు మద్దతు ఎందుకు ఇస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీలు పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో ఆర్టీసీని విలీనం చేశారా అని ప్రశ్నించారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆర్టీసీ కార్పొరేషన్‌లాగానే ఉందన్నారు. అసంబద్ధమైన విమర్శలు చేస్తున్న పార్టీలను ప్రజలు ఈసడించుకుంటున్నారని విమర్శించారు మంత్రి  పువ్వాడ అజయ్. తాజాగా మంత్రి చేసిన వ్యాఖ్యలపై కార్మిక సంఘాలు ఎలా స్పందిస్తాయో చూడాలి. 
Read More : బస్ భవన్ వద్ద ఉద్రిక్తత : ప్రగతి భవన్ ముట్టడిస్తాం – లక్ష్మణ్