హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో ఎంఎంటీఎస్ రెండో దశ సర్వీసులు ఏప్రిల్ నెలలో ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం పూర్తయిన తెల్లాపూర్, రామచంద్రాపురం (5.75 కి.మీ), మౌలాలి నుంచి ఘట్ కేసర్ (12.2కి.మీ) మార్గాల్లో ఆపరేషన్స్ ప్రారంభించనున్నారు. 2012-13 ఆర్ధిక సంవత్సరంలో రూ.817 కోట్ల రూపాయల అంచనాలతో ప్రాజెక్టు మొదలు పెట్టారు. ఈ నాలుగేళ్లలో రూ.540 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇప్పటికి 2 మార్గాలు పూర్తి చేశారు. మౌలాలి నుంచి సనత్ నగర్ సెక్షన్ లో డిఫెన్స్ ల్యాండ్ ఉన్నందున కొంత ఇబ్బంది ఉండగా ఈ పనులు జరిగేలా రాష్ట్రపతి హామీ ఇచ్చారు.
రెండో దశలో మొదటి భాగాన్ని సెప్టెంబర్, అక్టోబరు నెలల్లో పూర్తి చేస్తామని అధికారులు చెపుతున్నారు. రెండో దశ ప్రాజెక్టు కోసం కేంద్రం గత బడ్జెట్ లో 10 లక్షల రూపాయలు కేటాయించింది. యాదాద్రి వరకు 33 కిలో మీటర్ల విస్తరణకు 20 కోట్ల రూపాయలు కేటాయించింది. రూ.412 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం, రైల్వే సంయుక్తంగా చేపడుతున్న ఈప్రాజెక్టు పనులు త్వరలో ప్రారంభం కానున్నట్లు అధికారులు చెప్పారు.
పూర్తయిన మార్గంలో MMTS రైళ్లు నడిపించేందుకు ఇప్పటికే బోగీలతో కూడిన రెండు రేక్ లు నగరానికి వచ్చాయి. మరో నాలుగు రేక్ లు ఎప్పుడు తీసుకు రావాలనే దానిపై రైల్వే అధికారులు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం 27 స్టేషన్ల ద్వారా ఎంఎం టీఎస్ రైల్వే వ్యవస్ధ రాకపోకలు సాగిస్తున్నది. ప్రతి రోజు 2 లక్షల మంది ప్రయాణికులు వీటిలో ప్రయాణిస్తున్నారు, రెండో దశకూడా పూర్తయితే ఇది 5 లక్షలకు చేరుకుంటుంది. యాదాద్రి వరకు విస్తరించాక ప్రయాణికుల సంఖ్య మంరిత పెరిగే అవకాశం ఉంది. మొత్తం ప్రాజెక్టును 2019 ఏడాది చివరి నాటికి పూర్తి చేసేందుకు ప్రణాళిక రూపోందించారు.