ఆలస్యంగా MMTS TRAINS

  • Publish Date - February 25, 2019 / 02:51 AM IST

నగరంలో ఎంఎంటీఎస్ రాకపోకలపై ప్రయాణీకులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. సమయపాలన పాటించకపోవడంతో రైళ్లు ఎప్పుడొస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. నిత్యం అరగంట ఆలస్యంగా రైళ్లు నడుస్తుండగా సాంకేతిక కారణాలతో పలు ట్రిప్పులు రద్దవుతున్నాయి. ఈ రైళ్లపై ఆధారపడి ప్రయాణం సాగించే ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు సకాలంలో కార్యాలయాలకు చేరలేకపోతున్నారు. ఆపీసులకు వెళ్లే సరికి బాస్‌తో చీత్కారాలు పరిపాటై పోయిందని పలువురు పేర్కొంటున్నారు. రైళ్ల ఆలస్యం..రద్దు కావడంతో ఆర్టీసీ బస్సుల వైపు పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. 

రైళ్ల రాకపోకల సమయాల్లో ఆలస్యం కావడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. జంట నగరాల నుండి వందల కిలోమీటర్ల దూరంలోని ప్రాంతాలకు ఎక్స్ ప్రెస్, సూపర్ ఫాస్ట్ రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. ప్రధాన రైళ్లకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి ప్లాట్ ఫామ్‌లను కేటాయిస్తున్నారు. దీనికారణంగా ఎంఎంటీఎస్ రైళ్లను స్టేషన్‌కి దూరంగా నిలిపివేస్తారు. సికింద్రాబాద్ స్టేషన్‌లో ఫలక్ నుమా – లింగంపల్లి మధ్య నడిచే రైళ్లకు బ్రేకులు పడుతున్నాయి. నాంపల్లి – లింగంపల్లి మధ్య నడిచే ఎంఎంటీఎస్ సర్వీసులు కూడా తరచూ స్తంభిస్తున్నాయి. ఇక మరమ్మత్తుల సంగతి చెప్పనవసరం లేదు. ఏదో ఒక మార్గంలో మరమ్మత్తులు చేపడుతున్నట్లు..పలు ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటిస్తున్నారు. 

ఎంఎంటీఎస్ రైళ్లను 2003లో ప్రవేశ పెట్టారు. ఫలక్ నుమా – సికింద్రాబాద్ – లింగంపల్లి, ఫలక్ నుమా – నాంపల్లి – లింగంపల్లి తదితర మార్గాల్లో ఈ రైళ్లు తిరుగుతున్నాయి. దాదాపు 1.6 లక్షల మంది సర్వీసుల సేవలను వినియోగించుకుంటున్నట్లు అంచనా. ప్రత్యేక లైన్ ఉండాలని ప్రతిపాదించినా అది ఇంకా కార్యరూపం దాల్చలేదు. ఇక ఎంఎంటీఎస్ రెండో దశలో నిర్లక్ష్యం కనిపిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. నగర శివార్లను కలుపుతూ రెండో దశను చేపట్టారు. ఘట్ కేసర్, పటన్ చెరు, ఉందానగర్, మేడ్చల్ తదితర ప్రాంతాలను ఎంఎంటీఎస్‌తో అనుసంధానం చేసేందుకు నిర్ణయించారు. ఇప్పటికైనా ఎంఎంటీఎస్‌లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని నగర ప్రజలు కోరుతున్నారు. 

ట్రెండింగ్ వార్తలు