Telangana Assembly
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఐదు రోజుల విరామం తర్వాత తిరిగి నేడు ప్రారంభం కానున్నాయి. శాసనసభ, శాసన మండలిలో ఇవాళ ప్రశ్నోత్తరాలు రద్దు చేసి, నేరుగా స్వల్పకాలిక చర్చ చేపట్టనున్నారు. కేంద్ర సర్కారు విద్యుత్ బిల్లుపై చర్చ జరగనుంది. ఆ బిల్లును తెలంగాణ సర్కారు వ్యతిరేకిస్తోన్న విషయం తెలిసిందే. అలాగే, జీఎస్టీ చట్ట సవరణ, నిజామాబాద్ పారిశ్రామిక ప్రాంత చట్ట సవరణతో పాటు పురపాలక నిబంధనల చట్ట సవరణ బిల్లులను టీఆర్ఎస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సి ఉంది.
అంతేగాక, వైద్య విద్యా శాఖకు సంబంధించి డీఎంఈ, అసిస్టెంట్ డీఎంఈల పదవీ విరమణ వయస్సును 65 ఏళ్లకు పెంచే చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ములుగు అటవీ కళాశాల, పరిశోధనా సంస్థను వర్సిటీగా మార్చే బిల్లు కూడా అసెంబ్లీ ముందుకు వస్తాయి. మోటారు వాహనాల పన్ను చట్ట సవరణ బిల్లునూ ప్రవేశపెడతారు.
మరోవైపు, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని ఉద్దేశించి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలను సభలో లేవనెత్తే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సభలో ఇవాళ మాజీ ఎమ్మెల్యే, దివంగత భీమపాక భూపతిరావుకు సంతాపం తెలుపుతారు.