ప్రతిష్టాత్మక ఇంటర్ సిటీ బస్ టెర్మినల్(ఐసీబీటీ) ప్రాజెక్ట్ అనేక అవాంతరాల అనంతరం మళ్లీ కదులుతుంది. సాధ్యమైనంత త్వరగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి పంపి అనంతరం అనుమతితో పనులు చేపట్టాలని హెచ్‌ఎండీఏ ఇంజనీరింగ్ విభాగం అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే నగరంలో ట్రాఫిక్ సమస్యలు కూడా తగ్గే అవకాశం ఉంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఈ ప్రాజెక్ట్‌కు పర్మిషన్ రావడంతో 2011లో ఈ ప్రాజెక్ట్ ప్రారంభం కావలిసి ఉండగా.. కాంట్రాక్ట్ దక్కించుకున్న కేఆర్‌ఆర్ ఇన్‌ఫ్రా కంపెనీ ఇన్‌కమ్‌ట్యాక్స్ సమస్య కారణంగా ఆలస్యం చేసింది. అయితే ఇంతలోనే ఐసీబీటీ ప్రాజెక్టు పనులు చేయాలనుకున్న మియాపూర్ విలేజ్ సర్వే నంబర్ 20(పీ), 28లోని 55 ఎకరాల భూమిపై సుప్రీంకోర్టు వరకు వెళ్లడంతో మరింత ఆలస్యమైంది. మియాపూర్‌లోని 200 ఎకరాల భూమి గొడవలో ఇద్దరు అన్నదమ్ములు ఆర్బిట్రేటర్ వద్దకు వెళ్లారు. చివరకు ఆ భూమిని చెరిసగం అమ్ముకోవచ్చని సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఇందులో హెచ్‌ఎండీఏకు చెందిన మియాపూర్ విలేజ్ సర్వే నంబర్ 20 (పీ), 28లోని 55 ఎకరాల భూమి కూడా ఉంది. దీని కారణంగా ఐసీబీటీ పనులకు ఆటంకం ఏర్పడింది. ఇదిలా ఉంటే భూమిని అమ్మమని, ఇప్పటికే భవనాలు కట్టామని మరికొంత మంది ఇంప్లీడ్ పిటిషన్ వేయడంతో అంతకుముందు సుప్రీం ఇచ్చిన ఆదేశాలను రీకాల్ చేసింది. దీంతో ఐసీబీటీ ప్రాజెక్టు పనులకు మార్గం సుగమమైంది. భవిష్యత్‌లో న్యాయపరమైన ఇబ్బందులు ఎదురుకాకుండా అడ్వొకేట్ జనరల్ సలహా కోరగా.. ప్రాజెక్టు పనులు చేపట్టవచ్చంటూ అడ్వొకేట్ జనరల్ హెచ్‌ఎండీఏకు సమాధానం ఇచ్చారు. దీంతో తాజా పరిస్థితులకు అనుగుణంగా ఐసీబీటీ ప్రాజెక్టుకు మరోసారి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకొని ముందుకు వెళ్లాలని అధికారులు భావిస్తున్నారు.
మియాపూర్‌లో చేపట్టనున్న ఇంటర్ సిటీ బస్ టెర్మినల్ ప్రాజెక్ట్ పూర్తయితే ఇక్కడ ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేట్ బస్సులు నిలపవచ్చు. ఏవైనా వాహనాలను పార్కింగ్ చేసుకునేందుకు రెంటల్ సర్వీసు అందుబాటులోకి వస్తుంది. ప్రజలకు కావల్సిన సౌకర్యాలైన ఆరోగ్యం దగ్గరి నుంచి వినోదం వరకు అన్ని వసతులు ఇక్కడ అందుబాటులోకి రానున్నాయి. అలాగే ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి నగరానికి వందలాది ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి. వీటి వల్ల నగరంలో ట్రాఫిక్ సమస్యలు. ఐసీబీటీ అందుబాటులోకి వస్తే నగరంలోకి వచ్చే దాదాపు వెయ్యి నుంచి రెండు వేల ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులను నియంత్రించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.