సిగ్నల్ జంప్ చేస్తే జరిమానా.. రాంగ్ రూట్ లో వెళ్తే జరిమానా.. ఓవర్ స్పీడ్ గా డ్రైవ్ చేస్తే జరిమానా.. ఇంతవరకూ ఒకే .. కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టాన్ని చూసి జనం బెంబేలెత్తిపోతున్నారు. చెప్పులు వేసుకుని బైక్ నడిపితే పోలీసులు జరిమానా విధిస్తున్నారు. ఇక లుంగీ కట్టుకుని డ్రైవింగ్ చేసినా ఫైన్ తప్పదంటున్నారు. చెప్పులేసుకుని డ్రైవింగ్ చేస్తే ఒకేసారి వెయ్యి రూపాయలు ఫైన్ కట్టాలి. రెండోసారి కూడా చెప్పులేసుకుని డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే 15రోజుల పాటు జైలు శిక్ష విధిస్తారు. ఇక రాజస్థాన్ పోలీసులు మరో అడుగు ముందుకేశారు. వాహనాలపై కులం పేరు, ఊరి పేరు కనిపించడానికి వీల్లేదంటూ ఆదేశాలు జారీ చేశారు. కొత్త వాహన చట్టంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
దేశవ్యాప్తంగా మొదలైన చలాన్ల వడ్డింపులు త్వరలో తెలుగే రాష్ట్రాల్లో అమలయ్యే అవకాశముంది. దీంతో ప్రజలు తమ వాహనాలను బయటకు తీయాలంటేనే వణికిపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ కొత్తచట్టం అమలైతే తట్టుకోవడం కష్టమే అంటున్నారు వాహనదారులు. ఒక్క వాహనానికి రూ.5 వేల చొప్పున మూడు సార్లు చలానా పడితే ఆ బండిని పోలీసులకు ఇచ్చేయడం తప్ప వేరే మార్గం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే నగరంలో నూటికి 90 శాతం మంది వాహనదారులు పేద, మధ్యతరగతి వారే ఉన్నారు.
బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి చిన్న చిన్న పనులు, ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటున్న వారు, ఉన్నత చదవులు చదువుకుంటున్న విద్యార్థులు అధికం. వారు నడిపే వాహనాలు మార్కెట్లో అమ్మితే రూ.20 వేలకు మించి రావు. అలాంటిది పెరిగిన జరిమానాలు ఒకటి రెండు సార్లు విధిస్తే అంతే..! వారు వాహనం అమ్మి జరిమానా చెల్లించడం, లేదంటే ఆ వాహనాన్ని పోలీసులకు ఇచ్చేయడం తప్ప మరో మార్గం లేదని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు.