ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్నపూర్ణ అపార్ట్‌మెంట్‌లో హత్యకు గురైన ఇస్రో సైంటిస్ట్ సురేష్ కుమార్(56) మృతదేహానికి గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం పూర్తయ్యింది. అనంతరం మృతదేహాన్ని ఎస్ఆర్ నగర్ పోలీసులు సురేష్ కుటుంబ సభ్యులకు అందించారు. పార్థివ దేహాన్ని బంధువులు చెన్నైకు తరలించారు. కాగా ప్రైమరీ మెడికల్ రిపోర్ట్ ప్రకారం సురేష్ తలపై గాయాలు ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు.
మృతదేహంపై లభించిన ఆధారాలను ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్‌కు పంపించగా.. హోమో సెక్సువల్ జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. మరోవైపు సురేష్ కాల్ డేటా ఆధారంగా శ్రీనివాస్ అనే వ్యక్తి హత్య చేసినట్లుగా పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.
కేరళకు చెందిన సురేష్ కుమార్, ఇందిర దంపతులు 25 ఏళ్ల క్రితం హైదరాబాద్ వచ్చారు. ఇందిర ఇండియన్ బ్యాంకు ఉద్యోగి. 2005లో ఆమె చెన్నైకి బదిలీపై వెళ్లారు. అమీర్‌పేట ధరమ్‌కరమ్ రోడ్డు అన్నపూర్ణ అపార్ట్‌మెంట్‌లోని తన ఫ్లాట్‌లో సురేష్ ఒంటరిగా ఉంటున్నారు.
అయితే హంతకుడు పదునైన ఆయుధంతో సురేష్ తల వెనుక భాగంలో మూడుసార్లు బలంగా కొట్టిన గాయాలు కనపడుతున్నాయి. స్థానికంగా ఓ ప్రముఖ స్కానింగ్ సెంటర్‌లో పనిచేసే శ్రీనివాస్ అనే వ్యక్తి రెండు నెలలుగా సురేశ్ ఫ్లాట్‌కు వస్తున్నాడని తెలిసింది.