అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ దుర్ఘటన జరిగిన తర్వాత, బాటిళ్లలో పెట్రోల్, డీజిల్ అమ్మకాలు నిలిపివేయాలని ప్రభుత్వం అన్ని పెట్రోల్ బంకులకు ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటీకీ పెట్రోల్ బంకుల్లో నిబంధనలు బేఖాతరు చేస్తూ వాటి యాజమాన్యాలు బాటిళ్లలో పెట్రోల్ నింపుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ‘దిశ’ సంఘనలోనూ బాటిల్ పెట్రోల్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది.
ప్రభుత్వం ఆదేశించినా నగరంలో ఇంకా బాటిళ్లలో పెట్రోల్ అమ్మకాలు యధేచ్ఛగా సాగుతునే ఉన్నాయి. అధికారులు బంకుల పైనా, చిల్లరగా అమ్మకాలు సాగిస్తున్న దుకాణాలపైనా దాడులు చేయకుండా ఉదాసీనంగా ఉండడంతో బాటిల్ అమ్మకాలు యధేఛ్చగా కొనసాగుతూనే ఉన్నాయి. ఇలాంటి వ్యాపారం పెట్రోల్ బంకులతో పాటు బాహాటంగా రోడ్డు పక్కన కూడా సాగుతున్నాయి.
అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజయారెడ్డి ఘటన, దిశపై అత్యాచారం, పెట్రోల్ పోసి తగలబెట్టడం, తహసీల్ ఆఫీసుల్లో పెట్రోల్ బాటిల్స్‌తో కలకలం వంటి ఘటనలను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం బాటిళ్లలో పెట్రోల్ అమ్మకాలపై ఆంక్షలు విధించింది. గతంలోనే ఈ ఆదేశాలు జారీ చేసినా అధికారుల సరిగా పట్టించుకోకపోవటంతో ఎక్కడా అమలు కావడం లేదు. దీంతో తాజాగా పోలీసు విభాగం గట్టి హెచ్చరికలు జారీ చేసింది. ఖాళీ బాటిళ్లలో పెట్రోల్, డీజిల్ పోస్తే శిక్ష తప్పదని హెచ్చరించింది. దీంతో పెట్రోల్ బంకుల్లో ‘నో పెట్రోల్ ఇన్ ప్లాస్టిక్ బాటిల్’ అనే బోర్డులు దర్శనమిస్తున్నాయి. అయితే, ఇది ఎంతవరకు పాటిస్తారోనన్న దానిపై బంకులపై పౌరసరఫరాల శాఖ దృష్టి సారించింది.
నగరంలో రోడ్లపైనే పెట్రోల్ అమ్మకాలు:
హైదరాబాద్ నగరం నడిబొడ్డుతో పాటు శివారు ప్రాంతాల్లో సైతం రోడ్డు పక్కన బహాటంగానే పెట్రోల్ బాటిళ్లలో పోసి అమ్మడం సాధారణ విషయంగా మారింది. నగరంలో పెట్రోల్ బంకుల మధ్య గల దూరాన్ని అవకాశంగా తీసుకుని మెకానిక్ షాపులు, గాలి నింపే దుకాణాల్లో పెట్రోల్‌ను బాటిళ్లలో విక్రయిస్తున్నారు. మరోవైపు నగర శివారు ప్రాంతాల్లో సైతం బాటిళ్లలో పెట్రోల్ నింపి టేబుళ్లపై పెట్టి అమ్మకాలు విచ్చలవిడిగా కొనసాగిస్తున్నారు. బహింరంగా ఇంతలా విక్రయిస్తున్నా నియంత్రించాల్సిన సంబంధిత అధికారులు చూస్తూ ఊరుకోవటం విస్మయం కలిగిస్తోంది.
ప్రయాణంలో పెట్రోల్ అయిపోతే:
ప్రభుత్వం ఒకవేళ ఈ నిబంధన కఠినంగా అమలు చేస్తే, ప్రయాణంలో ఉన్నప్పుడు పెట్రోల్ అయిపోయి, దారిలో వాహనాలు నిలిచిపోతే పరిస్థితి ఏంటనేది ఇప్పుడు చాలామంది వాహనదారులను వేధిస్తున్న ప్రశ్న. ఇప్పటి వరకు ఇలాంటి సంఘటనలు ఎదురైతే ఓ బాటిల్ తీసుకుని దగ్గరలోని బంకుకు వెళ్లి పెట్రోల్ తెచ్చుకునేవారు. ఇంకొందరు కుటుంబ సభ్యులకో, స్నేహితులకో ఫోన్ చేస్తే వారు బాటిళ్లలో పెట్రోల్ తెచ్చి ఇచ్చేవారు. ప్రస్తుత పోలీస్ నిబంధనల నేపథ్యంలో ఇకపై బాటిళ్లలో పెట్రోల్ తీసుకెళ్లడం కుదరదు.
అయితే, అత్యవసర పరిస్థితుల్లో వినియోగదారులకు అధికారులు కొంత వెసులుబాటు కల్పించారు. పెట్రోల్ కోసం బాటిల్‌తో వచ్చినవారి వారి పేరు, ఫోన్ నంబర్, వాహనం రిజిస్ట్రేషన్ నంబర్ వంటి వివరాలతో పాటు సదరు వ్యక్తుల ఫొటో సైతం స్మార్ట్ ఫోన్‌లో తీసుకుని పెట్రోల్ ఇవ్వొచ్చని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.