లంచగొండుల గుండెల్లో గుబులు పుట్టించే వార్త ఇది. తెలంగాణలో ఓ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ) లంచం తీసుకుని అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కి దొరికిపోయాడు. అయితే తెలివిగా ఆలోచించిన ఆ అధికారి బాధితుల వద్ద నుంచి తీసుకున్న డబ్బుని దొరకకుండా చించి టాయిలెట్‌లో వేసేశాడు. అయినా కూడా ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. అసలు విషయం ఏమిటంటే.. షకీల్ అహ్మద్ అన్సారీ అనే వ్యక్తి జూనియర్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ఉన్నాడు.
కేశంపేట మండలం వేములనర్వాకు చెందిన రైతు ప్రభాకర్‌రెడ్డి, అమ్మ సరోజినమ్మ, అన్న బుచ్చిరెడ్డిలపై భూవివాద కేసు 2017లో నమోదైంది. వయసు మీద పడడంతో ఆమె ఏజ్‌ను దృష్టిలో పెట్టుకుని, సరోజినమ్మ పేరును ఛార్జిషీటు నుంచి తొలగించారు. అయితే సరోజినమ్మ పేరు తొలగింపుకి ఏపీపీ అభ్యంతరం తెలిపాడు. ఆమె పేరును తొలగించడానికి వీళ్లేదంటూ బెదిరించాడు. డబ్బుల కోసం ప్రభాకర్‌రెడ్డిని వేధించి, రూ.8000ను డిమాండ్ చేశాడు. దీంతో ప్రభాకర్‌రెడ్డి ఏసీబీని ఆశ్రయించారు.
ఈ క్రమంలో ముందే నోట్లకు సంబంధించిన నెంబర్లను ముందే నమోదు చేసుకున్న ఏసీబీ అధికారులు ప్రభాకర్ రెడ్డి చేత డబ్బులు ఇప్పించి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ క్రమంలో దొరికిపోయానని గమనించిన షకీల్ అహ్మద్.. నోట్లను తీసుకుని వెళ్లి టాయిలెట్‌లో ముక్కలు చేసి పడేశాడు. అయితే ఏపీపీ నాటకాన్ని పసిగట్టిన ఏసీబీ అధికారులు టాయిలెట్‌కు అనుసంధానంగా ఉన్న డ్రైనేజీ పైప్‌లైన్‌ను తెరచి, దాని నుంచి చినిగిపోయిన నోట్ల ముక్కలను బయటకు తీయించారు. అనంతరం నోట్లను పరిశీలించి నెంబర్లను మ్యాచ్ చేయగా.. సరిపోవడంతో షకీల్ అహ్మద్‌ని అరెస్ట్ చేశారు.