సర్కార్ మెట్టు దిగడం లేదు. కార్మికులు పట్టు వీడటం లేదు. హక్కుల సాధన వరకు పోరాటమంటోంది కార్మిక లోకం. ప్రజలకు ఇబ్బంది పెట్టేవారిని సహించేది లేదంటూ హెచ్చరిస్తోంది ప్రభుత్వం. ఆర్టీసీ సమ్మె.. ప్రభుత్వానికి, కార్మికులకు మధ్య అగాధాన్ని పెంచింది. మరి ఈ వ్యవహారం సద్దుమణుగుతుందా? ఇద్దరి మధ్య సయోధ్య కుదురుతుందా? ఏం జరగబోతోంది? పండగ పూట ఆర్టీసీ సమ్మె తెలంగాణలో కాకరేపింది. ప్రగతి రథ చక్రానికి బ్రేకులు వేసిన కార్మికులు.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ సమ్మెబాట పట్టారు. దీంతో పాటు మరిన్ని డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు. అయితే ఇప్పటికే నష్టాల్లో ఉన్న వ్యవస్థను మరింత అప్పుల్లో కూరుకుపోనివ్వమంటూ ప్రభుత్వం ససేమిరా అంది. కార్మిక సంఘాల డిమాండ్లను తోసిపుచ్చింది. డెడ్‌లైన్ పెట్టి విధుల్లో హాజరుకావాలని హెచ్చరించింది. అయినా కార్మికులు వెనక్కి తగ్గకపోవడంతో.. సెల్ఫ్ డిస్మిస్ అయ్యారంటూ 48వేల మందికి షాక్ ఇచ్చింది.
ప్రభుత్వం ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్ ప్రయోగిస్తామంటూ హెచ్చరించినా.. కార్మికులు వెనక్కితగ్గలేదు. డిమాండ్ల సాధన వరకు సమ్మె విరమించేది లేదని ప్రకటించారు. పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అన్ని వర్గాల మద్దతు కూడగట్టి ప్రభుత్వంపై పోరాటానికి దిగుతామన్నారు. ఇందులో భాగంగా 2019 అక్టోబర్ 09వ తేదీ బుధవారం సమావేశం కానున్న ఆర్టీసీ జేఏసీ.. కార్యాచరణను రూపొందించనుంది.
మరోవైపు ఇప్పటికే చర్చలు జరిపే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన ప్రభుత్వం.. ఆర్టీసీని కొత్త జవసత్వాలతో నింపుతామని ప్రకటించింది. మరి.. సమ్మె చేస్తున్న కార్మికులను ఒక్క కలం పోటుతో మాజీ ఉద్యోగులుగా మార్చేస్తుందా? లేదంటే ఉదారంగా ఆలోచించి చర్చలకు ఆహ్వానిస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది. అయితే రెండు వర్గాలు కూడా దూకుడుగానే ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. ఎవరూ వెనక్కి తగ్గేలా కనిపించకపోవడం.. ఎస్మా ప్రయోగం తథ్యమని ప్రచారం జరుగుతుండటం అందరిలో ఉత్కంఠను కలిగిస్తోంది.
Read More : హైదరాబాద్ లో మళ్లీ కుండపోత : అప్రమత్తమైన అధికారులు