ఆగని నిరసనలు : ఆర్టీసీ డిపోల ఎదుట కార్మికుల ఆందోళనలు

  • Publish Date - November 6, 2019 / 04:44 AM IST

తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 33వ రోజుకు చేరుకుంది. 2019, అక్టోబర్ 05వ తేదీ నుంచి సమ్మె కొనసాగుతోంది. దశల వారీగా ఆందోళనలు చేపడుతున్న కార్మికులు నవంబర్ 06వ తేదీ బుధవారం ఆర్టీసీ డిపోల ఎదుట కుటుంబసభ్యులతో ఆందోళన నిర్వహించారు. తెల్లవారుజామునుంచే నిరసనలు కొనసాగించారు. బస్సులు బయటకు రాకుండా..అడ్డుకున్నారు. ముందే మోహరించిన..పోలీసులు వీరిని అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం..తోపులాటలు చోటు చేసుకున్నాయి. ఆందోళనకారులను అరెస్టు చేసి పీఎస్‌లకు తరలించారు. 

జగిత్యాల బస్ డిపోకు మహిళా కండక్టర్లు, అఖిలపక్షం నాయకులు చేరుకుని బస్సులను అడ్డుక్కున్నారు. 12 మందిని అరెస్టు చేశారు. పీఎస్‌కు తరలిస్తుండగా..లక్ష్మణ్ అనే కార్మికుడు అస్వస్థతకు గురయ్యాడు. సూర్యాపేట డిపో ఎదుట కార్మికులు చేపట్టిన ధర్నాకు రాజకీయ పార్టీలు మద్దతుగా నిలిచాయి. మంచిర్యాల, నాగర్ కర్నూలుతో పాటు పలు ఆర్టీసీ డిపోల ఎదుట కార్మికులు నిరసన చేపట్టారు.

కాచిగూడ ఆర్టీసీ బస్ డిపో ఎదుట కార్మికులకు మద్దతుగా సీపీఐ నేత నారాయణ బైఠాయించారు. చర్చలు జరిగితే..ఏది సాధ్యమో..ఏది అసాధ్యమో తేలుతుందన్నారు. మేడ్చల్ జిల్లా కుషాయిగూడ డిపో ఎదుట ఆందోళనలు చేస్తున్న కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

మరోవైపు ప్రగతి భవన్‌లో మంత్రి పువ్వాడ, ఆర్టీసీ ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం విధించిన డెడ్ లైన్..విధులకు హాజరు కాని కార్మికులు..బస్సు రూట్ల ప్రైవేటు..నవంబర్ 07వ తేదీన కోర్టులో జరిగే విచారణ..తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. ఆర్టీసీపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకొనే ఛాన్స్ ఉంది. నవంబర్ 06వ తేదీ బుధవారం లేదా, నవంబర్ 07వ తేదీ గురువారం ప్రభుత్వం అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేస్తుందని తెలుస్తోంది. 
Read More : ఉద్యోగం ఊస్టింగేనా : ఆర్టీసీపై సీఎం కేసీఆర్ సమీక్ష