ఓయూలో ఉత్సవాలు : తెలుగు విభాగానికి 100 ఏళ్లు

  • Publish Date - January 30, 2019 / 03:30 AM IST

హైదరాబాద్ : ఎందరో మహానుభావులను తీర్చిదిద్దిన ఉస్మానియా తెలుగు విభాగం వంద వసంతోత్సవాల్లోకి అడుగు పెట్టబోతోంది. ఈ సందర్భంగా శతాబ్ధి ఉత్సవాలను నిర్వహించేందుకు ఓయూ తెలుగు శాఖ అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. జనవరి 31వ తేదీన ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు శాఖ రూపొందించిన వెబ్ సైట్‌ను ఉప కులపతి ప్రారంభించనున్నారు. ఉదయం 11గంటలకు ఆర్ట్స్ కళాశాల న్యూ సెమినార్ హాల్‌లో సంబరాలు నిర్వహించనున్నట్లు తెలుగు విభాగాధిపతి ఆచార్య సూర్యా ధనుంజయ్ వెల్లడించారు. 1951లో ఎంఏ తెలుగుశాక మొదటి విద్యార్థిని ఇల్లిందుల సుజాత ప్రత్యేక అతిథిగా రానున్నారని తెలిపారు. 

1917లో స్థాపించినా…తెలుగు విభాగం మాత్రం 1919లో ఏర్పాటైంది. ప్రముఖ కవి రాయప్రోలు సుబ్బారావు అధిపతిగా నియమితులయ్యారు. గ్రాడ్యుయేట్ స్థాయిలో తెలుగు భాషను మొదట పరిచయం చేశారు. 1939-40 విద్యా సంవత్సరం నుండి తెలుగులో పూర్తికాల పీజీ కోర్సు ఏర్పాటు చేశారు. ప్రపంచస్థాయిలో తెలుగుకు గుర్తింపు వచ్చేందుకు ఓయూ తెలుగు స్టూడెంట్స్ విశేష కృషి చేశారు. ప్రాంతీయ భాషలోనే ఉన్నత విద్యాబోధన జరగాలని నాటి నిజాం ప్రభువు మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ ఓయూను స్థాపించారు. ఉర్దూ భాష అభివృద్ధి లక్ష్యంతో ఏర్పాటైనా ఇతర భాషలకు ఎంతగానో సహకారాలు అందించింది. తొలి రోజుల్లో తెలుగు చదువుకొనే స్టూడెంట్స్ చాలా తక్కువ. రేకుల షెడ్డుల్లో చదువు కొనసాగేది. బీఏ కోర్సుల్లో మాత్రమే తెలుగుకు అవకాశం కల్పించారు. ఉపాధ్యాయుల సంఖ్య 12 ఉంటే విద్యార్థులు మాత్రం 8 మందే ఉన్నారు. 

ఇంగ్లీషు పరీక్షలను తప్పనిసరిగా ఇంగ్లీషులోనే రాయాలనే నిబంధనను డీసీ రెడ్డి తీసుకొచ్చారు. ఎన్నో ఏళ్లపాటు కొనసాగుతూ వస్తున్న తెలుగులో రాసే విధానానికి తెరపడినట్లైంది. ఈ నిర్ణయం వల్ల ఓయూకు తగిన గుర్తింపు వచ్చింది. పీజీ కోర్సుల్లో సెమిస్టర్ విధానాన్ని ఆయన అమలు చేశారు. అంతర్జాతీయ విద్యార్థుల కోసం సింగిల్ విండో అడ్మిషన్‌ను ప్రారంభించడంతో విదేశీ విద్యార్థుల రాక ఓయూకి ఎక్కువైంది. తెలుగు విభాగం ఆధ్వర్యంలో వేలాదిగా విద్యార్థులు పలు పరిశోధనలు చేశారు.