పాలమూరు, సీతారామ లైన్ క్లియర్ : అటవీ భూములకు అనుమతి

  • Publish Date - February 17, 2019 / 02:09 AM IST

హైదరాబాద్‌: పాలమూరు–రంగారెడ్డి, సీతా రామ ఎత్తిపోతల పథకాలకు అవసరమైన అటవీ భూముల బదలాయింపునకు  రాష్ట్ర అటవీ శాఖ అనుమతులు మంజూరు చేసింది.  ఈ ప్రాజెక్టులకు అవసరమైన అటవీ భూములను వాడుకునేందుకు ఇప్పటికే కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ అనుమతులిచ్చింది. అటవీ భూముల బదలాయింపుకు సంబంధించి రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అజయ్‌మిశ్రా శనివారం ఉత్తర్వులు ఇచ్చారు. సీతారామ ఎత్తిపోతలకు గత నెలలో చెన్నై ప్రాంతీయ కార్యాలయం అటవీ అనుమతులిచ్చింది.  సీతారామ ప్రాజెక్టు కోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు, పాల్వంచ, కొత్తగూడెం అటవీ డివిజన్లలోని 12వందల 01 హెక్టార్లు, ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, ఖమ్మం డివిజన్లలోని 330 హెక్టార్లు  మొత్తం 1 వెయ్యి 531 హెక్టార్ల అటవీ భూమిని నీటిపారుదల శాఖకు బదలాయిస్తూ రాష్ట్ర అటవీశాఖ నిర్ణయం తీసుకుంది.

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణంకోసం నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట అటవీ డివిజన్‌ లోని 205.48 హెక్టార్ల అటవీ భూమిని సాగునీటి శాఖకు అప్పగించాలని ప్రభుత్వం కేంద్రాన్ని కోరగా, ఇటీవలే తుది దశ అనుమతులు వచ్చాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర అటవీ శాఖ ప్రాజెక్టులో భాగంగా నిర్మి స్తున్న మొదటి స్టేజి పంప్‌ హౌస్, నార్లపూర్‌ వద్ద అంజనగిరి రిజర్వాయర్, నార్లపూర్‌ –అంజనగిరి – ఏదుల వీరాంజనేయ రిజర్వాయర్‌ల మధ్య టన్నెల్‌ తవ్వకపు పనులకు అటవీ భూములను బదిలీచేస్తూ రాష్ట్ర అటవీ శాఖ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత అనుమతితో 205.48 హెక్టార్ల అటవీ భూమి పాలమూరు ప్రాజెక్టు సీఈ ఆధీనంలోకి వస్తుంది. 

ట్రెండింగ్ వార్తలు