మే 27న ఫలితాలు : ప్రశాంతంగా పరిషత్ ఎన్నికలు 

  • Publish Date - May 15, 2019 / 01:44 AM IST

తెలంగాణ పరిషత్‌ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మూడు విడతల్లో 5,817 ఎంపీటీసీలు, 538 జడ్పీటీసీలకు ఎన్నికలు నిర్వహించగా 162 ఎంపీటీసీలు, నలుగురు జడ్పీటీసీలు ఏకగ్రీవమయ్యారు. మిగిలిన స్థానాలకు ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించింది రాష్ట్ర ఎన్నికల సంఘం. కొన్ని గ్రామాల్లో సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఎన్నికలను బహిష్కరించారు. చెదురుమొదురు సంఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి.

పరిషత్‌ ఎన్నికల చివరి దశ పోలింగ్‌ 9,494 కేంద్రాల్లో పోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది. మంచిర్యాల, కుమ్రంభీం, భద్రాద్రి, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్‌ ముగిసింది. చివరిదైన ఈ విడతలో 160 జడ్పీటీసీ, 1710 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్‌ నిర్వహించారు. ఈ నెల 6న తొలివిడుత పరిషత్ ఎన్నిలకు జరిగాయి. 2,166 ఎంపీటీసీలకు, 197 జడ్పీటీసీలకు నోటిఫికేషన్ ఇవ్వగా 69 ఎంపీటీసీ, రెండు జడ్పీటీసీలు ఏకగ్రీవమయ్యాయి. 6న జరిగిన పరిషత్ ఎన్నికల్లో పోలింగ్ 76.80 శాతం నమోదు అయ్యింది. ఇక రెండో విడుత పరిషత్ ఎన్నికలు ఈనెల 10న జరిగాయి. 1913 ఎంపీటీసీలు,180 జడ్పీటీసీలకు నోటిషికేషన్ ఇవ్వగా 63 ఎంపీటీసీలు, ఒకరు జడ్పీటీసీలు ఏక్రగీవం అయ్యారు. రెండవ విడుతలో జరిగిన పరిషత్ ఎన్నిలక పోలింగ్ 77.63 గా నమోదు అయ్యింది.

మూడు దశల్లో పరిషత్ ఎన్నికలకు  ప్రశాంతంగా ఓటుహక్కును వినియోగించుకునేలా ఈసీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఎక్కడా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా భారీ భద్రతను ఏర్పాటు చేశారు.  పోలింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ ను విధించారు. వెబ్‌ కాస్టింగ్‌ ద్వారా పోలింగ్‌  తీరును.. అధికారులు ఎప్పటికప్పుడు  పర్యవేక్షించారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా పోలింగ్ కేంద్రాల దగ్గర అన్ని ఏర్పాట్లు చేయడంతో పోలింగ్‌ ప్రక్రియ ముగిసింది. మే 27న ఓట్ల లెక్కింపుతో పాటు అదే రోజు ఫలితాలు వెల్లడించనున్నారు. దీంతో బరిలో దిగిన అభ్యర్థులంతా ఆరోజు కోసం ఎదురు చూస్తున్నారు…