తెలంగాణ కాంగ్రెస్ నేత, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఫోన్ చేసి మాట్లాడారు. రేవంత్ రెడ్డికి ఫోన్ చేసిన పవన్ కళ్యాణ్.. నల్లమల అడవుల విషయంలో కలిసి పోరాడుదాం అని అన్నారు. తెలంగాణలోని నల్లమల అడవులలో యురేనియం తవ్వకాలను నిరసిస్తూ సేవ్ నల్లమల పోరాటంను కలిసి చేద్దామని కోరారు.
యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా సోమవారం ఉ.10 గంటలకు దస్ పల్లా హోటల్‌లో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తున్నామని, ఆ కార్యక్రమానికి రావాలని రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. ఇందుకు రేవంత్ రెడ్డి వస్తున్నట్లు చెప్పారు.
తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించ తలపెట్టిన యురేనియం తవ్వకాల ప్రతిపాదనపై కాంగ్రెస్ ఇప్పటికే పోరాటం చేస్తుంది. నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలు జరపకుండా ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే యూరేనియం తవ్వకాలపై పోరాటం చేయాలని పవన్ కళ్యాణ్ కూడా నిర్ణయం తీసుకున్నారు.
కాంగ్రెస్ కూడా ఇదే విషయమై వీహెచ్ నేతృత్వంలో కమిటీ వేసింది. యూరేనియం తవ్వకాలు సాగితే.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని, కిడ్నీలకు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందని, కొందరు పిచ్చివాళ్లు అవుతారని, వికలాంగులు అవుతారని, ఎక్స్ పర్ట్స్ ను పిలిచి ప్రజల్లోకి ఈ విషయాన్ని తీసుకుని వెళ్లాలని అనుకుంటుంది. అందులో భాగంగానే ఆల్ పార్టీ మీటింగ్ జరగనుంది.