ఆర్డర్ ఒకటిస్తే.. మరొకటి డెలివరీ చేశారు: పేటీఎమ్‌కు రూ.35వేలు ఫైన్

  • Publish Date - October 21, 2019 / 04:31 AM IST

ఆపిల్ కంపెనీకి చెందిన వాచ్‌కు బదులుగా.. వేరే వాచ్‌ను డెలివరీ చేసినందుకు ఓ వ్యక్తి పేటీఎమ్ యాప్‌పై జిల్లా వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాడు.

వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌కు చెందిన రిషబ్ బి అనే వ్యక్తి ఫిబ్రవరి 22, 2018న రూ .22,900 విలువైన ఆపిల్ వాచ్ సిరీస్ 1 ను ఆన్‌లైన్‌లో పేటీఎమ్ ద్వారా కొనుగోలు చేశాడు. అయితే ఫిబ్రవరి 24వ తేదీన కేవలం  రూ .2,350 విలువైన వాచ్‌ను, ఆపిల్ వాచ్‌కు బదులుగా కంపెనీ పంపిణీ చేసింది. దీంతో పేటీఎమ్‌కు పలుమార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదు.

ఈ విషయమై తనను మోసం చేశారంటూ రిషబ్.. వినియోగదారుల ఫోరంను ఆశ్రయించగా అతనికి చివరకు న్యాయం జరిగింది. విచారణ జరిపిన వినియోగధారుల ఫోరం పేటీఎమ్‌ను అతనికి రూ. 35వేలు జరిమానాగా కట్టాలంటూ ఆదేశించింది. అంతేకాదు తప్పుగా స్వీకరించిన వస్తువు గురించి ఫిర్యాదు ఉన్నందున, పేటీఎమ్ వెంటనే సమస్యను పరిష్కరించాలని ఆదేశించింది.