కలప స్మగ్లర్లపై పీడీయాక్ట్ : కేసీఆర్ ఆదేశాలు

  • Publish Date - January 26, 2019 / 01:47 PM IST

హైదరాబాద్ : రాష్ట్రంలో అడవులు కాపాడే విషయంలో ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుందని, కలప స్మగ్లర్లపై పి.డి. యాక్టు నమోదు చేసి శిక్షిస్తామని  సీఎం కేసీఆర్ హెచ్చరించారు. శనివారం ఆయన అటవీశాఖపై  ప్రగతి భవన్లో  పోలీస్, అటవీశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అడవులు నరికి, కలప స్మగ్లింగ్ చేసే వారిని గుర్తించే పనిలో ఇంటెలిజెన్స్ వర్గాలున్నాయని ఆయన తెలిపారు. అడవులను రక్షించే విషయంలో చిత్తశుద్ది, దృఢచిత్తం, అంకితభావం కలిగిన అటవీశాఖ అధికారులను అటవీ ప్రాంతాల్లో నియమించాలని ఆయన ఆదేశించారు. 
అటవీ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తామని, అడవి నుంచి పూచిక పుల్ల కూడా బయటకు పోకుండా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. సాయుధ   పోలీసులు, అటవీశాఖ అధికారులతో కలిసి జాయింట్ ఫ్లయింగ్ స్వ్కాడ్ లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆబృందాలు అడవిలో నిరంతర తనిఖీలు నిర్వహించడంతో పాటు, అడవి నుంచి వెళ్లే మార్గాలపై నిఘా పెట్టాలని సీఎం చెప్పారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, డి.ఎఫ్.ఓ.లు కలిసి తమ జిల్లా పరిధిలో అడవుల సంరక్షణకు కావాల్సిన కార్యాచరణ రూపొందించాలని ఆయన తెలిపారు. క్షేత్ర స్థాయిలో పోలీస్ ఇన్స్ పెక్టర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో అడవులు రక్షించే బాధ్యతుల నెరవేర్చాలని  సీఎం  ఆదేశించారు.